: బెంగాల్లో బీజేపీకి ‘సున్నా’ సీట్లేనట!... మళ్లీ ‘దీదీ’దే విజయమంటున్న సర్వే


పశ్చిమ బెంగాల్ లో దశాబ్దాల కమ్యూనిస్టుల పాలనకు చరమగీతం పాడిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ... రెండో పర్యాయం కూడా అధికారాన్ని కైవసం చేసుకుంటుందట. బెంగాల్ సీఎంగా తొలి టెర్మ్ ను దిగ్విజయంగా పూర్తి చేసుకుంటున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ (దీదీ) రెండో పర్యాయం కూడా సీఎం సీటుపై కూర్చోవడం ఖాయమేనట. ఈ మేరకు ‘ఏబీపీ న్యూస్-నీల్సన్’ సర్వే చెబుతోంది. ఆశ్చర్యకరంగా త్వరలో ఆ రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల్లో కమల దళం బీజేపీకి సింగిల్ సీటు కూడా దక్కదట. ఈ మేరకు ఆ సర్వే సంస్థ నిన్న సంచలన ఫలితాలను ప్రకటించింది. మొత్తం 294 అసెంబ్లీ సీట్లలో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఏకంగా 197 సీట్లను కైవసం చేసుకుని సంపూర్ణ మెజారిటీతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందట. ఇక, దీదీకి ముందు రెండున్నర దశాబ్దాల పాటు రాష్ట్రాన్ని పాలించిన కమ్యూనిస్టుల గ్రాఫ్ అట్టడుగుకు పడిపోయింది. తాజా సర్వే ప్రకారం లెఫ్ట్ పార్టీలకు కేవలం 74 సీట్లు మాత్రమే దక్కనున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఖాతాలో 16 సీట్లు పడతాయని, మరో ఏడింటిలో ఇతరులు విజయం సాధిస్తారని సర్వే చెబుతోంది. ఇక బెంగాల్ లో సత్తా చాటాల్సిందేనని బరిలోకి దిగిన బీజేపీకి సింగిల్ సీటు కూడా దక్కదని చెబుతున్న ఆ సర్వే ఫలితాలు సంచలనం రేపుతున్నాయి.

  • Loading...

More Telugu News