: బాహుబలి, కంచె చిత్రాలకు ఏపీ శాసనసభలోనూ ప్రశంసలు
జాతీయ అవార్డులకు ఎంపికైన ‘బాహుబలి’, ‘కంచె’ చిత్రాలకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ అభినందనలు తెలియజేసింది. బాహుబలి, కంచె చిత్ర బృందాలకు అభినందనలు తెలుపుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు సభలో చదివి వినిపించారు. తెలుగు జాతి గర్వించేలా తెలుగు సినీ పరిశ్రమ మరిన్ని అద్భుత చిత్రాలు రూపొందించాలని స్పీకర్ కోడెల, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. మరోవైపు తెలంగాణ శాసనసభలోనూ ఈరోజు ఉదయం తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు బాహుబలి చిత్రానికి ప్రత్యేకంగా అభినందలు తెలిపారు. జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికై, తెలుగు చలన చిత్ర పరిశ్రమ సత్తాను చాటిందని ఆయన కీర్తించారు. జాతీయ అవార్డును దక్కించుకున్న ‘బాహుబలి’కి తెలంగాణ అసెంబ్లీ అభినందనలు తెలుపుతూ తీర్మానాన్ని ఆమోదించింది.