: సోమేశ్ కుమార్ సహా 15 మంది సివిల్ సర్వెంట్లు తెలంగాణకు కేటాయింపు...క్యాట్ తీర్పు
తెలంగాణలోనే వుండాలని కోరుకుంటున్న కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు తాజాగా సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ (క్యాట్)లో ఊరట లభించింది. గతంలో జీహెచ్ఎంసీ కమిషనర్ గా పనిచేసిన సోమేశ్ కుమార్ విభజన చట్టం ప్రకారం ఏపీ కేడర్ కు వెళ్లాల్సి ఉంది. అయితే కేసీఆర్ సర్కారు ఆయనను రిలీవ్ చేయలేదు. సోమేశ్ సేవలు తమకు అవసరమని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. దీంతో ఆయనతో పాటు మరో 11 మంది ఐఏఎస్, నలుగురు ఐపీఎస్ లు తాము తెలంగాణలోనే కొనసాగుతామంటూ క్యాట్ ను ఆశ్రయించారు. దీనిపై సుదీర్ఘ విచారణ జరిపిన క్యాట్... కొద్దిసేపటి క్రితం సంచలన తీర్పు చెప్పింది. ఇష్టమైన చోట పనిచేసేందుకు అధికారులకు హక్కు ఉందని పేర్కొన్న క్యాట్... సోమేశ్ సహా 15 మంది అధికారులు తెలంగాణలోనే పనిచేసేందుకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తీర్పుతో సోమేశ్ కుమార్ సహా ఐఏఎస్ అధికారులు శివశంకర్ లాహుటి, రోనాల్డ్ రాస్, వాకాటి కరుణ, వాణిప్రసాద్, గుమ్మళ్ల సృజన, హరికిరణ్, అనంతరాములు, ఆమ్రపాలి, ఎస్ఎస్ రావత్, మల్లెల ప్రశాంతిలతో పాటు ఐపీఎస్ అధికారులు సంతోష్ మెహ్రా, అభిషేక్ బిస్ట్, ఏవీ రంగనాథ్, అంజనీ కుమార్ తదితరులు కూడా ఇకపై తెలంగాణలోనే కొనసాగనున్నారు.