: శాసన సభలో వైఎస్సార్సీపీ నేతలను పేరుపేరునా పిలిచిన చంద్రబాబు...'పట్టిసీమ'పై చర్చలో ముచ్చట!
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో నేడు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. పోలవరం ప్రాజెక్టుపై జరిగిన చర్చ సందర్భంగా అసలు స్టోరేజీ లేని పట్టిసీమను ప్రభుత్వం ఎందుకు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందో అర్థం కావడం లేదని వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పట్టిసీమ కారణంగా 1600 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ నేతలకు వాస్తవాలు అర్థం కావడం లేదని అన్నారు. కృష్ణా డెల్టాలో పంటలు ఎండిపోకుండా నాలుగు టీఎంసీల నీరును పట్టిసీమ ద్వారా తరలిస్తున్నామని అన్నారు. పట్టిసీమ, పోలవరంలను అడ్డుకునేందుకు వైఎస్సార్సీపీ నేతలు చాలా కష్టపడుతున్నారని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా రాయలసీమకు చెందిన వైఎస్సార్సీపీ నేతలు ప్రతి ఒక్కరినీ పేరుపేరునా పిలిచి, మీరు ఎవరు అడ్డుకున్నా పట్టిసీమ, పోలవరం పూర్తి చేస్తామని, మీమీ నియోజక వర్గాలకు కూడా నీరిస్తామని ముఖ్యమంత్రి అన్నారు. మీరు అడ్డుకున్నారని ప్రజలకు చెబుతానని ఆయన చెప్పారు. వైఎస్సార్సీపీ నేతల పేర్లను చంద్రబాబు పిలిచిన సందర్భంగా శాసనసభ నవ్వులతో నిండిపోయింది.