: ఐదుగురు ప్రయాణికులు, సిబ్బందే బందీలు... మిగిలిన వారిని వదిలేసిన హైజాకర్
అలెగ్జాండ్రియా నుంచి కైరో వెళుతున్న ఈజిప్ట్ విమానాన్ని హైజాక్ చేసిన దుండగుడు క్షణాల వ్యవధిలో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. నడుముకు బెల్ట్ బాంబులు కట్టుకుని కాక్ పిట్ లోకి వెళ్లి విమానాన్ని హైజాక్ చేసిన ఆ దుండగుడు... సదరు విమానాన్ని సైప్రస్ లో బలవంతంగా దించేశాడు. విమానం హైజాక్ అయిన విషయాన్ని ధ్రువీకరించిన ఈజిప్ట్ ఎయిర్... విమానంలో 81 మంది ప్రయాణికులు, సిబ్బందితో పాటు మొత్తం 90 మంది ఉన్నట్లు ప్రకటించింది. సైన్యం రంగంలోకి దిగకుంటే మహిళలు, చిన్న పిల్లలను వదిలేస్తానని ప్రకటించిన అతడు... సైన్యం వెనకడుగు వేయగానే ఇచ్చిన హామీని అమలు చేశాడు. విమాన సిబ్బందితో పాటు మరో ఐదుగురు ప్రయాణికులను బందీలుగా పట్టుకున్న హైజాకర్ మిగిలిన వారందరినీ వదిలేశాడు. హైజాకర్ దయతో బయటపడ్డ ప్రయాణికులు బతుకు జీవుడా అంటూ విమానం దిగేసి, అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న బస్సులో ఎక్కేశారు. ఇక తన డిమాండ్లు నెరవేరే దాకా బందీలుగా పట్టుకున్న వారిని విడిచిపెట్టేది లేదని హైజాకర్ చెబుతున్నట్లు సమాచారం. అయితే అతడి డిమాండ్లేమిటన్న విషయం మాత్రం తెలియరాలేదు.