: కర్నూలు టీడీపీలో భగ్గుమన్న విభేదాలు... భూమాపై శిల్పా ఘాటు వ్యాఖ్యలు


కర్నూలు టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. నిన్న నంద్యాల పరిధిలోని కొత్తపల్లి సర్పంచ్ గా ఉన్న తన ప్రధాన అనుచరుడు తులసిరెడ్డిపై జరిగిన హత్యాయత్నంపై ఆ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవలే వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన భూమా నాగిరెడ్డి వర్గమే తులసిరెడ్డిపై దాడి చేసిందని ఆరోపించిన ఆయన కొద్దసేపటి క్రితం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుతో భేటీ అయ్యారు. తులసిరెడ్డిపై దాడి చేసింది ముమ్మాటికీ భూమా వర్గమేనని ఆయన ఫిర్యాదు చేశారు. దీనిపై పరిశీలించి చర్యలు తీసుకుంటామని చంద్రబాబు ఆయనకు హామీ ఇచ్చారు. చంద్రబాబుతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన సందర్భంగా శిల్పా... భూమాపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమను అణగదొక్కేందుకే భూమా యత్నిస్తున్నారని శిల్పా ఆరోపించారు. అయితే తామేమీ భూమాకు తీసిపోమని, భూమా కింద అణగిమణిగి ఉండేందుకు తాము సిద్ధంగా లేమని ఆయన పేర్కొన్నారు. భూమా వ్యవహారం ఆది నుంచి వివాదాస్పదమేనని ఆరోపించారు. నంద్యాలలో నడిరోడ్డుపై వీరంగం చేసిన భూమా... మునిసిపల్ వైస్ చైర్మన్, పలువురు కౌన్సిలర్లపై బహిరంగంగానే దాడి చేశారన్నారు. నంద్యాల డీఎస్పీపైనా భూమా చిందులు తొక్కిన వైనం అందరికీ తెలిసిందేనన్నారు. ఇప్పటికే ఐదు పర్యాయాలు దాడులకు పాల్పడిన భూమా వర్గం... తాజాగా తులసిరెడ్డిని హత్య చేసేందుకు యత్నించిందని శిల్పా ధ్వజమెత్తారు.

  • Loading...

More Telugu News