: అందుకే యూనివర్సిటీల్లో విచ్చలవిడితనం వచ్చింది: కేసీఆర్
నియంత్రణ లేకపోవడంతోనే యూనివర్సిటీ వైస్ చాన్సలర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, అందుకే యూనివర్సిటీల్లో విచ్చలవిడితనం వచ్చిందని తెలంగాణ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణ శాసనసభలో ఈరోజు ఆయన మాట్లాడుతూ.. గతంలో యూనివర్సిటీ వైస్ చాన్సలర్లు ప్రవర్తించిన తీరుపై విచారణ చేయించాల్సిన దుస్థితి వచ్చిందని ఆయన అన్నారు. వర్సిటీలకు గొప్ప వ్యక్తులను వీసీలుగా నియామించాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. హైకోర్టు సీజేను కలిసి వీసీల నియామకానికి కొందరు జడ్జిలను ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. యూనివర్సిటీలను పటిష్ట పర్చడానికి న్యాయమూర్తులను వీసీలుగా నియమించాలని తమ ప్రభుత్వం సంకల్పించిందన్నారు. యూనివర్సిటీలకు ఇచ్చిన స్వయం ప్రతిపత్తి దుర్వినియోగం అయిందని గుర్తించాలన్నారు. యూనివర్సిటీలకు పూర్వ వైభవం తెచ్చేందుకే నియామకాల కోసం వేసే కమిటీలో ప్రతిపక్ష సభ్యుడు కచ్చితంగా ఉండేలా చూస్తామని కేసీఆర్ ప్రకటించారు.