: రోజంతా.. ఉల్లాసంగా, ఉత్సాహంగా గ‌డిపేద్దాం


ప్ర‌తీరోజూ చేసే రొటీన్ ప‌నుల‌తో బోర్ కొడుతోందా.. ప‌ని మ‌ధ్య‌లో ప‌దే ప‌దే అల‌సి పోతున్నారా. ప‌నంతా విడిచిపెట్టి సేద‌తీరాల‌నిపిస్తోందా..? అయితే, ఎప్పుడూ కొత్తగా ఆలోచించండి. దీంతో పనిపట్ల మరింత ఇష్టం కలుగుతుంది. రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటూ మీ నిరుత్సాహాన్ని చిత్తు చేయొచ్చు. ఆఫీస్ వర్క్ తో పాటు ఇంటిపనిలో అలసిపోకుండా కొన్ని చిన్ని చిన్ని జాగ్ర‌త్తలు తీసుకోండి. రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే.. సరైన వ్యాయామం, మంచి పోషకాహారం, వేళకు నిద్రపోవడం.. వంటివి తప్పనిసరి. ఈ క్రమంలో బలహీనతను తరిమికొట్టి శక్తిని తిరిగి పొందాలంటే అనేక‌ మార్గాలున్నాయి. ఇంట్లో కానీ, ఆఫీస్‌లో కానీ, ఆకలితో.. దాహంతో.. అలాగే ఉండిపోయి పనిచేసుకోకూడదు. నీరు అధికంగా తాగాలి. టీ, కాఫీలు అతిగా తీసుకోకూడ‌దు. మీరు ఒత్తిడిలో ఉన్నప్పుడు చూయింగ్‌ గమ్‌ను నమలడం వల్ల మీ మూడ్‌ మారుతుందని నిపుణులు చెప్తున్నారు. అదే పనిగా గంట‌ల త‌ర‌బ‌డి వృత్తిలో మునిగిపోతే విసుగు వస్తుంది. శరీరం అలసటకి లోనవుతుంది. అందుకని పని చేస్తున్న సమయం మధ్యలో పదినిమిషాల సమయం అయినా సరే కళ్లు మూసుకొని రిలాక్స్‌ అవ్వాలి. దీని వల్ల చురుకుగా ఉండగలుగుతారు. శరీరానికి తక్షణ శక్తిని అందించడానికి అరటి పండు బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే సుక్రోజ్, గ్లూకోజ్, ఫ్రక్టోజ్.. వంటి చక్కెరలు బలహీనమైన శరీరానికి తక్షణం శక్తిని అందించడానికి తోడ్పడతాయి. పనులను వాయిదా వేసుకోవడం అలవాటు చేసుకోకండి. రేపు చేసేద్దాం లే అని అనుకోవ‌ద్దు. రేప‌టికి వాయిదా వేసిన ప‌నులు ఒత్తిడిని పెంచుతాయి. ఉన్న కాస్త సమయంలోనే అన్ని పనుల్నీ పూర్తిచేయగలమా? అన్న ఆందోళనకు గురవుతాం. ఎప్పటి పనుల్ని అప్పుడు పూర్తిచేసుకోవడమే మంచిది. దీంతో ఎలాంటి ఒత్తిడి, ఆందోళనకు గురికాము. మర్నాడు కాస్త ఆలస్యంగా లేచినా ఉత్సాహంగా రోజుని ప్రారంభించగలుగుతాం. పొద్దున లేవగానే పూలని చూడటం వల్ల మనసు ఉత్తేజితం అవుతుందని హార్వర్డ్ యూనివర్సిటీ నిపుణులు చెబుతున్నారు. ఆఫీసులో అదే పనిగా కూర్చొని పనిచేయకూడదు. కంప్యూటర్‌ను అదే పనిగా చూడటం వల్ల కంట్లో నీరు ఇంకి కళ్ళు పొడిబారినట్లుగా మారిపోతాయి. అందుకే విధినిర్వహణలో ఉన్నప్పుడు, కనీసం మూడు గంటలకు ఒక్కసారైనా సరే ఐదు నిమిషాలు మన సీటులోంచి లేచి అలా నడిచి రావాలి. దీంతో మీలో ఉత్తేజాన్ని నింపుకోవ‌చ్చు. పాటలు వినడం వల్ల మనసుకు ప్రశాంతత కలుగుతుంది. మీకు ఇష్టమైన మెలోడి పాట‌ల‌ను వింటే మ‌న‌సు తేలికైపోతుంది. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఏదో ఒక కొత్తదనంతో రోజుని గ‌డ‌పండి. శరీరం నీటిని కోల్పోవడం వల్ల కూడా శక్తి నశించి అలసిపోయినట్లుగా అనిపిస్తుంటుంది. మరి దీన్ని అధిగమించాలంటే పండ్ల రసాలు, నీరు, క్యారట్ జ్యూస్.. వంటివి ఎక్కువగా తీసుకోవాలి.

  • Loading...

More Telugu News