: యాపిల్ సాయం లేకుండానే సాధించేసిన ఎఫ్బీఐ
యూఎస్ లోని శాన్ బెన్రార్డినో పై దాడి చేసిన ముష్కరుడు సయ్యద్ ఫరూక్ ఐఫోన్ ను అన్ లాక్ చేసే విషయంలో యాపిల్ సాయం లేకుండానే పని జరిగిపోయింది. ఆ ఫోన్ ను అన్ లాక్ చేస్తే, కస్టమర్లలో నమ్మకం కోల్పోయే ప్రమాదముందని యాపిల్ వాదించిన సంగతి తెలిసిందే. తాజాగా, ఇజ్రాయిల్ కు చెందిన ఓ ఫోరెన్సిక్ కంపెనీ సాయంతో ఫరూక్ స్మార్ట్ ఫోన్ ను ఎఫ్బీఐ అధికారులు అన్ లాక్ చేసినట్టు తెలుస్తోంది. ఆపై యాపిల్ సంస్థపై పెట్టిన కేసును సైతం ఎఫ్బీఐ ఉపసంహరించుకుంది. ఫోన్ అన్ లాక్ కు సహకరిస్తే, డిజిటల్ సెక్యూరిటీ, ప్రైవసీ విభాగాల్లో అనుమానాలు తలెత్తుతాయని యాపిల్ చేసిన వాదనకు గూగుల్, ఫేస్ బుక్ సైతం మద్దతు పలికిన సంగతి తెలిసిందే. "యాపిల్ తో వివాదానికి ముగింపు పలకాలని భావిస్తున్నాం. అందుకే పెట్టిన కేసు తీసేశాం. ఓ మధ్యవర్తి సంస్థ ద్వారా ఐఫోన్ ను అన్ లాక్ చేయగలిగాం. ప్రస్తుతం అందులోని సమాచారాన్ని విశ్లేషిస్తున్నాం" అని యూఎస్ అటార్నీ ఎలీన్ డెకర్ ఓ ప్రకటనలో తెలిపారు.