: ఇటార్సీలో దారుణం!... అర్ధనగ్నంగా యువకుడిని రైలు కిటికీకి కట్టేసి కొట్టిన దుండగులు
మధ్యప్రదేశ్ లోని ఇటార్సీ రైల్వే స్టేషన్ లో నిన్న దారుణం చోటుచేసుకుంది. రైలు ప్రయాణంలో భాగంగా ఓ యువకుడు, కొంతమంది యువకుల మధ్య చోటుచేసుకున్న వాగ్వాదం చిలికి చిలికి గాలివానలా మారింది. ఒక్కడుగా ఉన్న యువకుడిపై పైచేయి సాధించిన అల్లరి మూక ఆ యువకుడిని నానా చిత్రహింసలకు గురి చేసింది. యువకుడిని అర్ధ నగ్నంగా తయారు చేసి రైలు కిటికీకి కట్టేసింది. ఆపై కర్రలు తీసుకుని యువకుడిని చితకబాదింది. యువకుడిని ఒక్కడిగా చేసి అల్లరి మూక సాగిస్తున్న దమన కాండను ప్రశ్నించిన నాథుడు ఒక్కరూ లేకపోయారు. యువకుడిని ఇష్టారాజ్యంగా కొట్టి ఆ అల్లరి మూక అక్కడి నుంచి జారుకున్న తర్వాత కానీ రైల్వే పోలీసులు అక్కడికి రాలేదు. ఘటనపై కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే, అల్లరి మూక దమనకాండను ఓ గుర్తు తెలియని వ్యక్తి తన సెల్ ఫోన్ లో రికార్డు చేసి మీడియాకు అందజేశారు. ప్రస్తుతం ఈ వీడియో నేషనల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.