: ఫిరాయింపుదారులను ఇరుకున పెట్టిన వైకాపా... అందరూ అసెంబ్లీకి రావాలని విప్!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశంలోకి చేరిన వారిని ఇరుకున పెట్టేందుకు ద్రవ్య వినిమయ బిల్లును వినియోగించుకోవాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఇప్పటికే బిల్లుపై ఓటింగ్ ను జరిపించాలని అసెంబ్లీ కార్యదర్శికి లేఖ ఇచ్చిన ప్రతిపక్షం, తన ఎమ్మెల్యేలందరికీ విప్ జారీ చేసింది. గతవారంలోనే విప్ సమాచారాన్ని ఎమ్మెల్యేలకు పంపిన వైకాపా, మరోసారి వారికి పార్టీ నిర్ణయాన్ని గుర్తు చేసింది. ఓటింగులో తప్పనిసరిగా పాల్గొనాలని ఆదేశించింది. ప్రతి ఎమ్మెల్యే అసెంబ్లీకి విధిగా హాజరు కావాలని, ద్రవ్య వినిమయ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని, లేకుంటే అనర్హత వేటు తప్పదని హెచ్చరించింది. కాగా, విప్ ను అందుకున్న ఎమ్మెల్యే, అసెంబ్లీకి హాజరై పార్టీకి అనుకూలంగా వ్యవహరించకుంటే, వారిని ఎమ్మెల్యే పదవుల నుంచి తొలగించే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే.