: టీడీపీ ఓ మునిగే పడవ!...రూ.100 కోట్లిచ్చినా వైసీపీని వీడేది లేదు: గిడ్డి ఈశ్వరి


‘‘ఎప్పటికైనా టీడీపీ... ఓ మునిగే పడవ. ఆ పార్టీలోకి పోయి ఏం చేయాలి? అలా చేస్తే జనాలు ఛీ కొడతారు’’ అని వైసీపీ మహిళా నేత, పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొద్దిసేపటి క్రితం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆమె టీడీపీ ‘ఆకర్ష్’పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తమ పార్టీ టికెట్ పై గెలిచిన వంతల రాజేశ్వరిని తమ పార్టీలో చేర్చుకునేందుకు టీడీపీ నేతలు యత్నించారని, అందుకు వారు రూ.20 కోట్లు ఎరగా వేశారని ఆమె ఆరోపించారు. రూ.20 కోట్లు కాదు కదా, రూ.100 కోట్లిచ్చినా తాము వైసీపీని వీడేది లేదని స్పష్టం చేశారు. కడదాకా వైసీపీలోనే కొనసాగుతామని కూడా ఈశ్వరి ఉద్ఘాటించారు. వైసీపీని దెబ్బకొట్టేందుకే టీడీపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. గిరిజన బిడ్డలమైన తాము వైఎస్ జగన్ వల్లే అసెంబ్లీలో అడుగుపెట్టగలిగామని ఆమె చెప్పారు. వైసీపీలో గిరిజన ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్నారని, వారిని లాక్కునేందుకే టీడీపీ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. ఇప్పటికైనా టీడీపీ నేతలు కుట్రలకు స్వస్తి చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News