: పూణె మహిళల్లో తీవ్రమైన మిస్టరీ రొమ్ము వైరస్!
మహారాష్ట్రలోని పూణె ప్రాంతంలో 20 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసున్న యువతుల్లో మిస్టరీ రొమ్ము వైరస్ విస్తరిస్తుండటం వైద్య వర్గాల్లో ఆలోచన పెంచుతోంది. గత సంవత్సరం అక్టోబర్ లో భోసారీ ప్రాంతానికి చెందిన 28 ఏళ్ల ఉపాధ్యాయురాలు తన ఎడమ రొమ్ములో తీవ్రమైన నొప్పి ఉందని డాక్టర్లను సంప్రదించడంతో ఈ వైరస్ వెలుగులోకి వచ్చింది. "ఎంతో నొప్పిగా ఉండేది. ద్రవాలు కారేవి. కొన్ని పెయిన్ కిల్లర్స్ తీసున్నా. బాధ తగ్గకపోగా, మరింతగా పెరిగింది. డాక్టర్ల వద్దకు వెళితే, ఆంకాలజిస్టును కలవమని సలహా ఇచ్చారు. పరీక్షల తరువాత నా రొమ్ములో తీవ్రమైన ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారు. ఆపై సర్జరీ చేసి చీమును తీసేశారు. నేనెంతో శుభ్రంగా ఉంటాను. ఇలా ఎందుకు జరిగిందో తెలియడం లేదు" అని ఆమె వివరించారు. ఇది ఆ యువతి వ్యధ మాత్రమే కాదు. పింప్రీ ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల మరో యువతికీ ఇదే సమస్య ఎదురైంది. తన ఎద ఆకృతి విచిత్రంగా మారిపోతుండటాన్ని గమనించిన ఆమె, క్యాన్సర్ సోకిందని భయపడి వైద్యులను సంప్రదించగా, తెలియని వైరస్ ఉందని చెప్పారు. దీంతో ఆమె నాలుగు నెలలుగా మందులు వాడుతోంది. పలు పరీక్షల అనంతరం ఇన్ఫెక్షన్ ఎందుకు సోకిందో వైద్యులు తేల్చలేకపోయారు. కాగా, పాలిచ్చే తల్లుల్లో ఈ సమస్య అధికంగా ఉందని, ఈ వైరస్ బారిన పడుతున్న వారిలో మదుమేహం, టీబీతో బాధపడుతున్నవారు అధికంగా ఉన్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో ఈ వైరస్ బారినపడిన వారి సంఖ్య 50 శాతం పెరిగిందని, నెలలో కనీసం ఐదుగురు ఈ సమస్యతో వైద్యులను సంప్రదిస్తున్నారని తెలుస్తోంది. ఇటీవల 40 సంవత్సరాల మహిళ ఒకరు సమస్యతో వైద్యులను సంప్రదించారని, ఏజ్ గ్రూప్ విస్తరించడం ప్రమాద ఘంటికలను మోగించినట్టేనని బ్రెస్ట్ సర్జన్ డాక్టర్ అనుపమా మనే వ్యాఖ్యానించారు. ఇన్ఫెక్షన్ కు సరైన కారణాన్ని ఇంకా కనుగొనలేదని డాక్టర్ సీబీ కొప్పికర్ వ్యాఖ్యానించారు. అధ్యయనాలు జరుగుతున్నాయని, త్వరలోనే రొమ్ముల్లో ఇన్ఫెక్షన్ కు సరైన కారణాలు కనుగొంటామని వైద్యులు అంటున్నారు.