: వాషింగ్టన్ చెక్ పోస్టు వద్ద ఎన్ కౌంటర్!
అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డీసీ ఉలిక్కిపడింది. ఇక్కడి ఓ చెక్ పోస్టు వద్ద నిన్న సాధారణ తనిఖీలు నిర్వహిస్తున్న సిబ్బంది ముందు ఓ అనుమానిత వ్యక్తి తుపాకీ తీయడంతో పోలీసులు అతనిని ఎన్ కౌంటర్ చేసి హతమార్చారు. ఈ ఘటనలో పక్కనే నడుస్తూ వెళుతున్న యువతికి గాయాలు అయ్యాయి. ఆ వెంటనే గంటపాటు అత్యవసర పరిస్థితిని ప్రకటించిన అధికారులు, వైట్ హౌస్ ను తాత్కాలికంగా మూసేస్తున్నట్టు ప్రకటించారు. ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు. అనుమానిత వ్యక్తి గుర్తింపు తమకు తెలుసునని పోలీస్ చీఫ్ మ్యాథ్యూ ఆర్ వెర్డోర్సా మీడియాకు తెలిపారు. అతని పేరు లారీ డాసన్ అని, వాషింగ్టన్ నగర బహిష్కరణ శిక్షను ఎదుర్కొంటున్నాడని వివరించారు. పోలీసు హెచ్చరికలను పట్టించుకోనందునే కాల్పులు జరిపామని తెలిపారు. కాగా, ఈ ఘటనలో గాయపడ్డ యువతి ప్రాణాలకు ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు.