: ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ 'ఉగాది' ఉత్సవం ఉందా... ఉంటే ఎక్కడ?
ఉగాది... తెలుగు సంవత్సరాది. ఉగాది పర్వదినం నాడు రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుందన్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ విడిపోకపూర్వం, హైదరాబాద్ లోని రవీంద్రభారతి వేదికగా ఉగాది వేడుకలు జరిగేవి. రాష్ట్రం విడిపోయిన తరువాత గత సంవత్సరం అమరావతి సమీపంలోని ఉద్దండరాయుని పాలెంలో వేడుకలు జరిగాయి. వీటికి ఏర్పాట్లు చేయడం కోసం అధికారులు చాలా కష్టపడాల్సి వచ్చింది కూడా. ఇక ఈ సంవత్సరం ఉగాది వేడుకలు ఎక్కడ నిర్వహించాలన్న విషయంలో ఇంతవరకూ నిర్ణయం వెలువడలేదు. కొందరు తుళ్లూరు మండలంలో అని, మరికొందరు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రమని అంచనాలు వేస్తున్నారు. పండగ పట్టుమని పది రోజులు కూడా లేదు. ఏర్పాట్లు చేసి, అందరికీ ఆహ్వానాలు పంపాలంటే, కనీసం వారం రోజులు పడుతుంది. ఇప్పటికీ పండగ వేదికపై అధికారులు ఓ నిర్ణయం తీసుకోకపోవడంతో, అధికారికంగా వేడుకలు ఉంటాయా? లేదా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. కాగా, ఉగాది వేడుకలు ఎక్కడ చేయాలన్న విషయమై నేడు ప్రకటన వెలువడుతుందని ఓ అధికారి వెల్లడించారు. ఈసారి షడ్రషోపేతమైన విందు కూడా ఉంటుందని పేర్కొన్నారు. ఆ వేదిక ఎక్కడన్న విషయాన్ని మాత్రం ఆయన చెప్పకపోవడం గమనార్హం.