: మొన్నటి బ్రస్సెల్స్ ఉగ్రదాడిలో ...అదృశ్యమైన ఇన్ఫోసిస్ ఉద్యోగి మృతి
బెల్జియం రాజధాని బ్రసెల్స్ ఎయిర్ పోర్టులో ఇటీవల జరిగిన ‘ఉగ్ర’ దాడుల అనంతరం కనిపించకుండా పోయిన ఇన్ఫోసిస్ ఉద్యోగి రాఘవేంద్ర గణేశన్ మృతి చెందాడు. ఈ విషయాన్ని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. బెంగళూరుకు చెందిన రాఘవేంద్ర గణేశన్ చివరిసారిగా బ్రసెల్స్ లోని ఒక మెట్రో రైలు నుంచి కాల్ చేసినట్లు రాయబార కార్యాలయం అధికారులు తెలిపారు. గణేశన్ మృతదేహాన్ని భారత్ కు పంపుతున్నామని, అతని కుటుంబానికి తమ సానుభూతి తెలుపుతున్నామని అధికారులు పేర్కొన్నారు. కాగా, నాలుగు సంవత్సరాలుగా బ్రసెల్స్ లో గణేశన్ పనిచేస్తున్నాడు. గత నెలలోనే గణేశన్ కుటుంబం బెంగళూరు వచ్చి వెళ్ళింది. గత మంగళవారం బ్రసెల్స్ ఎయిర్ పోర్టు లో జంట పేలుళ్ల కారణంగా సుమారు 35 మంది ప్రయాణికులు చనిపోగా, 300 మంది గాయపడ్డారు.