: కదలకుండా కూర్చుంటే, వదలకుండా వెంటాడే అనర్థాలు!
ఇంట్లో అయినా ఆఫీసులోనైనా సరే కదలకుండా కూర్చుంటే వదలకుండా రోగాలు దరిచేరతాయి. ఈ విషయాన్ని అమెరికన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ లో పేర్కొంది. ఈ మేరకు 54 దేశాల్లో నిర్వహించిన సర్వేలో ఈ విషయం బయటపడిందన్నారు. మనుషుల ప్రవర్తన, దేశ జనాభా, మరణాల సంఖ్య, ఇతర గణాంకాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఆయా దేశాల్లో సంభవించిన మరణాలను విశ్లేషించగా... మూడు గంటల కంటే ఎక్కువసేపు కదలకుండా కూర్చోవడం కారణంగా సంభవించిన మరణాల శాతం 3.8. ఈ తరహా మరణాలు అమెరికా, యూరోపియన్, తూర్పు మధ్యదరా దేశాలతో పాటు పశ్చిమ పసిఫిక్ ప్రాంతంలో కూడా ఎక్కువేనని తేలింది. ఎక్కువ సేపు కదలకుండా కూర్చోవడం కారణంగా కలిగే అనర్థాలను మనం శారీరకంగా ఎంత కష్టపడ్డా తగ్గించుకోలేమని పరిశోధకులు వెల్లడించారు. గంటల పాటు కూర్చుని ఉండే వాళ్లు గంటకోసారైనా లేచి రెండు, మూడు నిమిషాలు తిరగడం వల్ల అనారోగ్యం పాలవ్వకుండా ఉండవచ్చని ఆ జర్నల్ లో పేర్కొంది.