: ‘పోలవరం’ నిర్మాణం బాధ్యతను భగవంతుడు నాకు ఇచ్చాడు : ఏపీ సీఎం చంద్రబాబు
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేసే బాధ్యతను భగవంతుడు తనకు ఇచ్చాడని, అది పూర్తి చేసి తన నీతి, నిజాయతీ నిరూపించుకుని రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలుపుతానని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ‘పట్టిసీమ’ ఎత్తిపోతల పథకం పనులను ఆయన ఈరోజు పరిశీలించారు. ప్రాజెక్టు పనుల పురోగతిని ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట పలువురు మంత్రులు, అధికారులు, ఉన్నారు. అంతకుముందు పోలవరం ప్రాజెక్టు పనులపై ఆయన ఏరియల్ సర్వే చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ, రాష్ట్రానికి పట్టిసీమ ప్రాజెక్టు ఒక కానుక అని అన్నారు. భారతదేశంలో ఎక్కడా కట్టనటువంటి పెద్ద ప్రాజెక్టు ఏదైనా ఉందంటే అది ‘పోలవరం’ ప్రాజెక్టేనని అన్నారు. ఈ ప్రాజెక్టుకు కేంద్రం కూడా పూర్తిగా సహకరిస్తే తాము కూడా బలమైన సంకల్పంతో ముందుకు వెళ్లే పరిస్థితి వస్తుందని, తాను కూడా దీనిపై ఎక్కువ శ్రద్ధ పెడుతున్నానని అన్నారు. ప్రాజెక్టు క్వాలిటీగా ఉండాలని, అదే సమయంలో త్వరగా పూర్తి కావాలని, అవసరమైతే పర్యవేక్షణకు నిపుణులను నియమిస్తామని అన్నారు.