: మెహబూబాతో 'భారత్ మాతాకీ జై' అన్న నినాదం పలికిస్తారా?: బీజేపీని సూటిగా ప్రశ్నించిన శివసేన


జమ్మూకాశ్మీర్ లో బీజేపీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న మెహబూబా ముఫ్తీ చేత భారత్ మాతాకీ జై అనే నినాదం పలికిస్తారా? అని శివసేన సూటిగా ప్రశ్నించింది. దేశంలో ప్రతి ఒక్కరూ భారత్ మాతాకీ జై అంటూ నినదించాలని, నినదించని వారంతా దేశద్రోహులంటూ గత కొంత కాలంగా బీజేపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జమ్మూకాశ్మీర్ లో బీజేపీ మద్దతుతో పీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఈ నేఫథ్యంలో సామ్నా పత్రిక సంపాదకీయంలో శివసేన పలు ప్రశ్నలు సంధించింది. ఉగ్రవాదుల పట్ల మెహబూబా ఎలా వ్యవహరిస్తారో అందరికీ తెలిసిందేనని సామ్నా తెలిపింది. దేశ వ్యతిరేక వ్యాఖ్యలు, చర్యలు చేసేవారిపట్ల గతంలో అధికారంలో ఉండగా ముఫ్తీ సయీద్ సర్కారు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వెల్లడించింది. అలాంటి పీడీపీ మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయనుందన్నారు. ఈ నేపథ్యంలో కాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడుల్లో అసువులు బాసిన కాశ్మీరీ పండిట్ల గౌరవార్థం మెహబూబా భారత్ మాతాకీ జై అంటూ నినదించగలరా? అని శివసేన ప్రశ్నించింది. ఆమె ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించడం పట్ల బీజేపీ ఆనందంగా ఉండి ఉండవచ్చుకానీ దేశం మాత్రం ఆందోళన చెందుతోందని సామ్నా అభిప్రాయపడింది.

  • Loading...

More Telugu News