: మీ అలవాట్లు, ఆలోచనలు ఎలా ఉన్నాయి..? మీ జీవనశైలిపై ఓ లుక్కేయండి!
ఈ స్పీడు యుగంలో చాలామంది పనిలో నిమగ్నమై శరీరం, మానసిక పరిస్థితిపై సరిగ్గా దృష్టి పెట్టలేకపోతున్నారు. అలాంటి వారిలో మీరూ ఉన్నారా..? జీవితాన్ని గజిబిజిగా గడిపేస్తున్నారని అనిపిస్తే.. మీ మానసిక పరిస్థితిని గుర్తించండి. మీ జీవనశైలిపై దృష్టి పెట్టండి. సానుకూల దృక్పథాన్ని పెంచుకోండి. అప్పుడే ప్రతికూలతను దూరం చేయగలిగే శక్తి వస్తుంది. మీ ఆలోచనా ధోరణిని గమనించుకోండి. ఎప్పుడైనా ప్రతికూల ఆలోచనలు వస్తున్నట్టు గమనిస్తే, వెంటనే దాన్ని మార్చే ప్రయత్నం చేయండి. మన జీవన పరిస్థితులు, మెరుగవుతున్న కొద్దీ ఆయుఃప్రమాణమూ మెరుగవుతోంది. జీవన శైలిలో భాగస్వామ్యమైన ఈ కింది విషయాల పట్ల దృష్టి పెట్టండి.. * ఆధునిక సాంకేతిక వస్తువులు మీ జీవితాలని సౌకర్యంగా మారిస్తే మంచిదే.. కానీ స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ లాంటి వాటికి బానిసలుగా మారిపోయి మీ సహజమయిన లక్షణాలని కోల్పోకుండా కాపాడుకోండి. అవసరం ఉన్నంత వరకే వాటిని ఉపయోగించండి. * ఉన్నవారికీ, లేనివారికీ కావలసిన ఏకైక సంపద ఆరోగ్యం మాత్రమే. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఆరోగ్యంపైనే మీ మొదటి ప్రియారిటీ ఉండేటట్లు చూసుకోండి. * ఆరోగ్యమనే మహాభాగ్యాన్ని పొందడం కోసం అనేక రకాలు పద్ధతులు పాటించవచ్చు. యోగా, ప్రాణాయామం, ఎరోబిక్స్, నడక, సైక్లింగ్ ఇతర ఏ పద్ధతయినా సరే.. ఏదైనా ఒకదాన్ని క్రమం తప్పకుండా పాటించండి. తోట పని చేయడం, మార్నింగ్ వాకింగ్ వంటి చిన్న చిన్న వ్యాయామాలు చక్కని ఆరోగ్యాన్నిస్తాయి. * పని ఒత్తిడిలో పడి ఆరోగ్యాన్ని నిర్లక్షం చేయకూడదు. ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి. బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యంగా బతకాలన్నదే నిజమైన జీవన విధానము. * పని చేయడంలో మీ క్రమశిక్షణ, విధి నిర్వహణలో మీ అంకిత భావం, మీ ఉద్యోగంలో తరచూ వచ్చే సమస్యలను పరిష్కరించడంలో మీకున్న నైపుణ్యత.. వీటన్నిటినీ మీ ఉద్యోగులతో సత్సంబంధాలు ఏర్పరచుకోవడానికి ఉపయోగించుకోవాలి. * శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకోగలిగే నైపుణ్యాలను అలవర్చుకోండి. అందరికీ సమర్థత, స్థాయి ఒకే తీరుగా వుండవు. కొందరికి కొన్ని నైపుణ్యాలు ఎక్కువగా ఉంటే మరికొందరికి మరికొన్నింట్లో ఉండొచ్చు. మీరు మీ నైపుణ్యాలు చిన్నవైనా, పెద్దవైనా ఎలాంటి రంగాలలో ఎక్కువ స్థాయిలో ఉన్నాయో గుర్తించే ప్రయత్నం చేయండి. వాటికి అనుగుణంగా మీ నైపుణ్యానికి సరిపోయే రంగాన్ని రెండు వైపుల నుండి ఆలోచించి అందులో ప్రవేశించే ప్రయత్నం చేయండి. * ఏదైనా జరగరాని సంఘటన జరిగితే దానికోసం ఆందోళన చెందకండి. మీ మనసుపై తీవ్రమైన ఒత్తిడి తీసుకురాకండి. ఎల్లప్పుడు ప్రశాంతంగా వుండడానికి ప్రయత్నించండి. * మీరు ఇంట్లోవున్న సమయంలో పిల్లలతో ఆటలాడండి. వారితో మమేకంకండి. దీంతో మీలో కొత్త శక్తి, ఉత్సాహం పెరుగుతాయి. అందునా పిల్లలతో గడిపే సమయంలో మీలోనున్న విపరీతమైన ఒత్తిడులు దూరమవుతాయని పరిశోధకులు పేర్కొన్నారు. * మీరు ఏదైనా సమాజసేవ చేసే సంఘాలతో పరిచయాలు పెంచుకోండి. వాటికోసం కాస్త సమయాన్ని కేటాయించండి. * మీ జీవనశైలిలో ఆహారం ఎలా తీసుకుంటున్నారో గమనించండి. ఆహారం తీసుకోవడంలో సమతుల్యత పాటించండి. మాంసకృత్తులు, పిండిపదార్ధాలు, కొవ్వుపదార్ధాలు, పీచుపదార్ధము, విటమిన్లు, ఖనిజలవణాలు, నీరు మీ ఆహారంలో ఉండేట్లు చూసుకోండి. * మీలో భక్తిభావం ఉంటే ఆధ్యాత్మిక గ్రంధాలు అనిర్వచనీయమైన మానసిక విశ్రాంతినిస్తాయి. కాబట్టి అటువంటి పుస్తకాలు తరచుగా చదువుతూ ఉండాలి. * ఆధ్యాత్మికం కోసం కాస్త సమయాన్ని కేటాయించండి. మీకు ఇష్టమైన పనిచేయడంకోసం కూడా సమయాన్ని కేటాయించడం అలవాటు చేసుకోండి. ఏకాంతంగా ధ్యానం చేయడం కొనసాగించండి. మెరుగైన జీవనశైలి మన విజయానికి బాటలు వేస్తుంది. ఆర్థికంగా ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా జీవితంలో ఉత్సాహం లేకపోతే లాభం లేదు. కాబట్టి ఉత్సాహవంతమైన జీవనం కోసం ప్రయత్నం మొదలు పెట్టండి.