: డైవోర్స్ కోసం లాయర్లను ఎందుకు సంప్రదిస్తున్నారు?: కంగనా రనౌత్
మహిళా ప్రాధాన్య చిత్రాల ద్వారా స్టార్ డమ్ సంపాదించుకున్న కంగనా రనౌత్ పై పాత్రల ప్రభావం పనిచేస్తున్నట్టు కనిపిస్తోంది. వివాహ బంధంపై అంత నమ్మకం లేదని గతంలో స్టేట్ మెంట్ ఇచ్చిన కంగనా...బాలీవుడ్ స్టార్ హీరోతో వివాదం నేపథ్యంలో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుత కాలంలో వైవాహిక బంధానికి అర్థం మారిపోయిందని చెప్పింది. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారని చెప్పింది. సమాజం మెప్పుకోసం పురుషులపై ఆధారపడడం లేదని తెలిపింది. స్వతంత్రంగా వ్యవహరిస్తున్న మహిళలు తమను బాగా చూసుకునే వ్యక్తులనే ఎంచుకుంటున్నారని పేర్కొంది. అయితే విడాకుల విషయంలో చట్టాలు తనకు అర్థం కావడం లేదని చెప్పింది. భార్యాభర్తలు సంతోషంగా లేమని భావించినప్పుడు, విడిపోవడమే మంచిదని భావించినప్పుడు లాయర్లను ఎందుకు సంప్రదిస్తున్నారో తనకు తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఎవరికి వారు సంబంధాలకు అతీతంగా జీవిస్తున్నప్పుడు ఇవన్నీ ఎందుకు? అని ఆమె ప్రశ్నించింది. తాను చట్టాలు రూపొందించలేదు కనుక, తాను చేయగలిగింది ఏమీ లేదని, తాను కూడా వాటిని పాటించాల్సిందేనని చెప్పింది.