: మద్యం సేవించి అతి చేసిన పైలట్... ప్రయాణికుల ముందే అరెస్ట్... తప్పిన పెను ప్రమాదం!


అనుమానాస్పద స్థితిలో కనిపించిన అమెరికన్ ఎయిర్ లైన్స్ పైలట్ ను ప్రయాణికుల ఎదుటే డెట్రాయిట్ మెట్రోపాలిటన్ ఎయిర్ పోర్టు అధికారులు అరెస్ట్ చేయడంతో వారంతా షాకయ్యారు. డెట్రాయిట్ నుంచి ఉదయం 7 గంటలకు ఫిలడెల్ఫియా వెళ్లాల్సిన విమానం బయలుదేరేందుకు సిద్ధమైన సమయంలో పైలట్ అతిగా ప్రవర్తిస్తూ ఉండటంతో అధికారులు అతనికి బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించారు. మోతాదుకు మించి మద్యం సేవించి వున్నాడని గమనించి అరెస్ట్ చేసి విమానాన్ని క్యాన్సిల్ చేస్తున్నట్టు ప్రకటించారు. తొలుత ఇతని ప్రవర్తన సరిగ్గా లేదని ట్రాన్స్ పోర్టేషన్ సెక్యూరిటీ ఏజంట్ గమనించాడని, ఆపై పోలీసులకు సమాచారం అందిందని విమానాశ్రయ ప్రజా సంబంధాల అధికారి మైఖేల్ కాన్వే వెల్లడించారు. అతన్ని అరెస్ట్ చేసిన తరువాత కూడా పరీక్షలు చేయగా, మరోసారి విఫలమయ్యాడని, విమానాన్ని ప్రయాణానికి అనుమతించి వుంటే పెను ప్రమాదం జరిగి వుండేదని తెలిపారు. ఇతనిని పెన్సిల్వేనియాకు చెందిన పైలట్ గా గుర్తించామని తెలిపారు. కాగా, పైలట్ కు బేడీలు వేసి తీసుకెళుతున్న చిత్రాన్ని టీనేజ్ ప్రయాణికురాలు అమందా తన సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. కాగా, అమెరికా నిబంధనల ప్రకారం, మద్యం సేవించిన 8 గంటల వరకూ పైలట్లు విమానం నడిపేందుకు అనుమతి లేదు.

  • Loading...

More Telugu News