: వారిద్దరి హనీమూన్ ను లోకమంతా చూస్తోంది!
హనీమూన్... కొత్తగా పెళ్లయిన జంట ఒకరి మనసు మరొకరికి దగ్గర కావాలని జరుపుకునే విహారయాత్ర. ఇక వరుడు ఓ రచయిత అయి, వధువు ఆయనకు నచ్చిన ఔత్సాహికురాలైతే... వారిద్దరూ కలిసి తమ హనీమూన్ ను వినూత్నంగా జరుపుకోవాలని భావించి, పర్వతారోహణను ఎంచుకుంటే... వారి మధ్య జరిగే చిలిపి సంభాషణల నుంచి, లక్ష్య సాధనలో పడ్డ కష్టాల వరకూ అన్నింటినీ సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటే... ఇక్కడ అదే జరిగింది. వారి హనీమూన్ ను నెట్ లోకమంతా ఇప్పుడు ఆసక్తిగా గమనిస్తోంది. ఆ రచయితే దూర్జయ్ దత్తా. వారం రోజుల క్రితం తన స్వీట్ హార్ట్ అవంతిక మెడలో తాళి కట్టిన దూర్జయ్, వెంటనే హనీమూన్ (ట్రెక్కింగ్) అంటూ చెక్కేసి 'హనీమూన్ డైరీస్' పేరిట తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో వ్యాసాలు పోస్టు చేయడం ప్రారంభించాడు. ప్రపంచంలోనే నాలుగో ఎత్తయిన శిఖరాన్ని అధిరోహించాలని నిర్ణయించుకున్నారు. ఆ దిశగా వారు పడ్డ కష్టాలను పంచుకున్నారు. దుబాయ్ లో వీసా రాకపోతే, ఆపై టాంజానియా వెళ్లి వీసా పొంది, ఎముకలు కొరికే చలిలో కిలిమంజారో పర్వతాన్ని ఎలా ఎక్కారో పూసగుచ్చినట్టు చెప్పారు. ఆ ఫోటోలను పంచుకున్నారు. లావా టవర్ వద్దకు వెళ్లి అక్కడ ఫోటోలు దిగారు. 'ప్యార్ దోస్తీ హై' అంటూ లగ్జరీ రిసార్టులో సైక్లింగ్ చేస్తూ సేదదీరిన అనుభవాన్ని అందరితో పంచుకున్నారు. ఈ ఫోటోలకు అధిక సంఖ్యలో లైకులు వస్తుండగా, నెటిజన్లు కొత్త జంటను అభినందనలతో ముంచెత్తుతున్నారు.