: దుర్గాష్టమికి ముందే కన్నయ్య, ఖలీద్ లను కాల్చిచంపుతాం: యూపీ నవనిర్మాణ సేన
జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ విద్యార్థి సంఘం నేత కన్నయ్య కుమార్, దేశ ద్రోహం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉమర్ ఖలీద్ లను దుర్గాష్టమిలోగా కాల్చి చంపుతామని ఉత్తరప్రదేశ్ స్థానిక రాజకీయ పార్టీ యూపీ నవనిర్మాణ సేన హెచ్చరించింది. వీరిద్దరూ మార్చి 31లోగా ఢిల్లీ వీడి వెళ్లాలని, లేకుంటే జేఎన్యూ క్యాంపస్ పై దాడి చేసి మరీ వీరిని హతమారుస్తామని నవనిర్మాణ సేన జాతీయ అధ్యక్షుడు అమిత్ జ్ఞానీ తన ఫేస్ బుక్ ఖాతాలో హెచ్చరించారు. భారత ఆర్మీపై కన్నయ్య కుమార్ చేసిన వ్యాఖ్యలపై ప్రస్తావిస్తూ, వారిని కాల్చి చంపించలేకుంటే, తాను రాజకీయాలకు దూరమవుతానని అన్నారు. "నన్ను తిట్టండి. నా కుటుంబాన్ని అనండి. నా మతాన్ని అనండి. కానీ దేశానికే గర్వకారణమైన సైనికులను అంటే చూస్తుండేది లేదు" అన్నారు. కాగా, అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు, జమ్మూకాశ్మీర్ లో భారత సైనికులు యువతులను సామూహిక మానభంగాలు చేస్తున్నారని కన్నయ్య సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.