: అవును సన్నీ చెప్పింది నిజమే... ఇక కోహ్లీ శకం మొదలైంది!
"భారత క్రికెట్ చరిత్రలో విరాట్ కోహ్లీ శకం మొదలైంది" నిన్నటి ఆస్ట్రేలియాతో మ్యాచ్ కి ముందు మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ (సన్నీ) చెప్పిన మాటిది. మ్యాచ్ కి ముందు చెప్పిన ఆ మాట, మ్యాచ్ తరువాత నిజమైందని వీరేంద్ర సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు. రెండు, మూడేళ్ల క్రితం వరకూ మైదానంలో వినిపించే 'సచిన్... సచిన్' స్థానంలో ఇప్పుడు 'కోహ్లీ... కోహ్లీ' అని వినిపించడం మొదలైంది. ప్రేక్షకుల మనసుల్లో సచిన్ స్థానం పదిలమే అయినప్పటికీ, మైదానంలోకి వచ్చే సరికి సచిన్ స్థానాన్ని కోహ్లీ తీసేసుకున్నాడు. నిన్నటి టీ-20 మ్యాచ్ లో ఫాల్కనర్ వేసిన 18వ ఓవర్ లో రెండు ఫోర్లు, ఓ సిక్స్ కొట్టి భారత్ పై ఉన్న ఒత్తిడినంతా మూడు బంతుల్లో తొలగించిన సమయంలో గ్రౌండంతా ఒకటే నినాదం. అదే 'కోహ్లీ... కోహ్లీ' ఆ మూడు బంతుల తరువాత, ఆస్ట్రేలియా సైతం మ్యాచ్ పై ఆశలు వదులుకుంది. వాస్తవానికి విరాట్ కోహ్లీ విజృంభించి ఆడటం నేడు మొదలైంది కాదు. గత సంవత్సర కాలంగా, అంటే టెస్టు కెప్టెన్సీని ధోనీ నుంచి తీసుకున్న తరువాత తనలోని అసలు సిసలు ఆటగాడు బయటకు వచ్చాడు. భారత క్రికెట్ కు సంబంధించినంత వరకూ ప్రస్తుతానికి కోహ్లీయే అభిమానుల మనసుల్లో నిలిచిపోయిన ఆటగాడు. కోహ్లీ ఆడితే గెలుస్తాం. లేకుంటే డౌటే... అన్నంతగా ఆటపై తనదైన ముద్ర వేశాడు. ఇక నిన్నటి ఇన్నింగ్స్ తరువాత సెహ్వాగ్ మరో అడుగు ముందుకేసి దేశానికి తరువాతి సచిన్ విరాట్ కోహ్లీయేనని పొగడ్తలతో ముంచెత్తాడు. "అవును. తదుపరి సచిన్ టెండూల్కర్ కోహ్లీయేనని నేను గొంతెత్తి చెప్పగలను. అతనే ప్రస్తుతం టెండూల్కర్ ఆఫ్ ఇండియన్ టీమ్. ఎందుకంటే, నేను ఎదుగుతూ టెండూల్కర్ ఆటను చూశాను. అలాగే టెండూల్కర్ ఎదుగుతూ గవాస్కర్ ఆటను చూశాడు. ఇప్పుడు కోహ్లీ ఆటను చూస్తున్న వారు మరో పదేళ్ల తరువాత టీమ్ లోకి వస్తారు" అని అన్నాడు. "ఓ ఆటగాడు పూర్థి స్థాయి ఆట ప్రదర్శించాడనడానికి 100 శాతం ఆడాడు అంటాం. కానీ సెమీస్ లో ఆస్ట్రేలియాతో కోహ్లీ అంతకు మించిన ఆటతీరును కనబరిచాడు. ముఖ్యంగా పరిమిత ఓవర్ల క్రికెట్లో తనకు ఎదురులేదని చాటాడు. ఒత్తిడిలో ఎలా నిబ్బరంగా, ప్రశాంతంగా ఉండాలో చూపాడు" అని గవాస్కర్ వ్యాఖ్యానించాడు. ఇక భారత క్రికెట్లో మొదలైన విరాట్ శకం మరో ఐదారేళ్లు... కుదిరితే ఇంకో రెండుమూడేళ్లు కచ్చితంగా కొనసాగుతుంది. ఈమధ్య కాలంలో మరెంతమంది కోహ్లీలు, సచిన్ లు పుట్టుకు వస్తారో కాలమే చెప్పాలి.