: పవన్ కల్యాణ్ అభిమానిని కొట్టి చంపిన చిరంజీవి అభిమాని!... బళ్లారిలో ఘటన
టాలీవుడ్ లో తారస్థాయికి చేరిన నటుడు, ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కల్యాణ్ కు నానాటికీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. అదే సమయంలో ఆయన సోదరుడు, కాంగ్రెస్ ఎంపీ మెగాస్టార్ చిరంజీవి అభిమానుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. ఒకే కుటుంబానికి చెందిన వీరి మధ్య రాజకీయాలు దూరాన్ని పెంచాయి. అయితే ఆ దూరం ఇప్పుడిప్పుడే కనుమరుగవుతోంది. ఈ క్రమంలో ఈ నెల 20న కర్ణాటకలోని బళ్లారిలో చోటుచేసుకున్న ఓ ఘటన వారిద్దరి అభిమానులను షాక్ కు గురి చేసింది. కాస్తంత ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనలో పవన్ కల్యాణ్ అభిమానిని చిరంజీవి అభిమాని కొట్టి చంపేశాడు. వివరాల్లోకెళితే... బళ్లారిలో కౌల్ బజార్ కు చెందిన ఇద్దరు యువకులు ఈ నెల 20న ఓ చోట కలిశారు. వీరిలో ఒకరు పవన్ కల్యాణ్ అభిమాని కాగా, మరొకరు చిరంజీవికి వీరాభిమాని. ఈ క్రమంలో ‘మా అన్న మెగాస్టార్ ను మించిన హీరో ఎవరూ లేరు’ అని చిరు అభిమాని అన్న మాట వారిద్దరి మధ్య ఘర్షణకు తెర లేపింది. ఇరువురు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో పట్టరాని కోపంతో చిరు అభిమాని చేతికందిన ఇనుప రాడ్ తీసుకుని పవన్ కల్యాణ్ అభిమానిని కొట్టాడు. దీంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు.