: థ్రిల్లింగ్ విజయంతో సెమీస్ లోకి ధోనీ సేన!... సిరీస్ నుంచి ఆసీస్ ఔట్!
కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని టీమిండియా మరో థ్రిల్లింగ్ విజయాన్ని నమోదు చేసింది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ మెగా టోర్నీలో సెమీ ఫైనల్ కు దూసుకెళ్లింది. టీమిండియా వైస్ కెప్టెన్, స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ వీరవిహారం చేయడంతో, పటిష్ట జట్టుగా పేరున్న ఆస్ట్రేలియా జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించక తప్పలేదు. నిన్న రాత్రి మొహాలీలో జరిగిన మ్యాచ్ లో ఆసీస్ పై టీమిండియా ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ నెగ్గి ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. ఆ తర్వాత 161 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ధోనీ సేన ఇంకో ఐదు బంతులు మిగిలి ఉండగానే నాలుగు వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ(12), శిఖర్ ధావన్(13) లు విఫలమైనా క్రీజులోకి వచ్చిన వెంటనే తన బ్యాటు పదును చూపిన విరాట్ కోహ్లీ(82) ఏమాత్రం విశ్రాంతి తీసుకోలేదు. వచ్చీరాగానే బ్యాటు ఝుళిపించిన కోహ్లీ కేవలం 51 బంతుల్లోనే 82 పరుగులు చేసి తనదైన శైలిలో వీర విహారం చేశాడు. సురేశ్ రైనా (10), యువరాజ్ సింగ్ (21) వెంటవెంటనే ఔటైనా, కోహ్లీ మాత్రం జట్టును విజయతీరాలకు చేర్చేదాకా విశ్రమించలేదు. చివరలో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (18)తో కలిసి ఆసీస్ బౌలింగ్ ను అతడు చీల్చి చెండాడాడు. ఒకానొక దశలో మ్యాచ్ ఆసీస్ వైపు మొగ్గినా, 19వ ఓవర్ లో ఓ రేంజిలో నాలుగు ఫోర్లు బాదిన కోహ్లీ... మ్యాచ్ ను తమ వైపు తిప్పుకున్నాడు. ఎప్పటిలానే కెప్టెన్ కూల్ విన్నింగ్ షాట్ తో మ్యాచ్ ను ముగించాడు. బరిలో నిలవాలంటే గెలిచి తీరాల్సిన ఈ మ్యాచ్ లో భారత్ విజయం సాధించి సెమీస్ లోకి దూసుకెళ్లగా, ఆసీస్ మాత్రం సిరీస్ నుంచి నిష్క్రమించింది.