: వందేమాతరం అంటే తల్లికి వందనం... అందులో తప్పేముంది?: వెంకయ్య నాయుడు
వందేమాతరం అంటే, తల్లికి వందనమని, అలా అనడంలో తప్పేంటని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖా మంత్రి వెంకయ్యనాయుడు ప్రశ్నించారు. ఈ ఉదయం హైదరాబాద్ లో జరిగిన ప్రవాస భారతీయ గ్రంథావిష్కరణ సభకు ముఖ్య అతిథిగా వచ్చిన ఆయన ప్రసంగించారు. మాతకు నమస్కరిస్తే తప్పేంటని, కొందరు కావాలనే వందేమాతరం గీతాన్ని విమర్శిస్తున్నారని అన్నారు. "పార్టీల ఓటు బ్యాంకు రాజకీయాలతో మనల్ని మనం చులకన చేసుకోవడం ఓ అలవాటు అయింది. ఈ పరిస్థితి మారాలి. కొందరు అవినీతి నుంచి ఆజాదీ కావాలని అవినీతిలో కూరుకుపోయిన పార్టీని కౌగిలించుకుంటున్నారు. జాతీయ గీతాల విషయంలో దేశంలో దశాబ్దాలుగా అమలవుతున్న విధానాలనే మేము కొనసాగిస్తున్నాం. వీటిని మార్చాలని నరేంద్ర మోదీ ఏమీ భావించడం లేదు. మాట్లాడే స్వేచ్ఛ ఉందని ఏదైనా అంటామనడం సరికాదు" అని ఆయన అన్నారు. అమెరికాకు వెళ్లడం తప్పుకాదని, అక్కడికి వెళ్లే వారు నైపుణ్యవంతులై తిరిగి స్వదేశానికి రావాలని హితవు పలికారు. అక్కడికి వెళ్లి ఇల్లు కట్టుకుని, ఫోటోలు తీసి పంపితే, వాటిని చూసి ఆనందించడమే తప్ప మరే ప్రయోజనం దక్కదని, దేశానికి ఎంతో కొంత ఇవ్వాలని యువతకు వెంకయ్య సలహా ఇచ్చారు. విదేశాల్లో ఉన్న వారు మనకన్నా అధికంగా భారత సంప్రదాయాలను పాటిస్తున్నారని అన్నారు. అక్కడి వారు మాతృదేశాన్ని వదిలిన కొరత వాళ్లకు తెలిసి వచ్చిందని, ఇక్కడి వారు మాత్రం డాడీ... బీడీ... గాడీ అంటున్నారని తనదైన శైలిలో ప్రసంగించారు.