: క్రికెట్ స్థాయికి ఫుట్ బాల్... సలహాలు కోరుతున్న మోదీ
ఇండియాలో క్రికెట్ ఏ స్థాయిలో అభివృద్ధి చెందిందో, అలాగే ఫుట్ బాల్ కూ ఆదరణ పెరగాల్సి వుందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. భారత ఫుట్ బాల్ ను మరో మెట్టిక్కించి, ఓ మంచి బ్రాండ్ తయారయ్యేందుకు తనకు సలహా, సూచనలను అందించాలని ఆయన కోరారు. ఈ ఉదయం 'మన్ కీ బాత్' (మనసులో మాట) 18వ ఎడిషన్ లో భాగంగా జాతిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. "ఫుట్ బాల్ లో మనం చాలా వెనుకబడి వున్నాం. అండర్ 17 ఫీఫా ఫుట్ బాల్ భారత అవకాశాలను మెరుగుపరిచింది. ఇప్పుడిప్పుడే యువత ఫుట్ బాల్ ఆటను చూసి ఆనందిస్తుండటం నాకు తెలుస్తోంది. ఆటకు ఆదరణ పెరిగే కొద్దీ మౌలిక వసతుల కల్పనకు కేంద్రం సహకరిస్తుంది" అని ఆయన అన్నారు. పాకిస్థాన్, బంగాదేశ్ లపై భారత క్రికెట్ జట్టు సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ, అదే విధంగా టోర్నీలో రాణించాలని మోదీ ఈ సందర్భంగా కోరారు. ఈ వేసవి సెలవులను యువత వృథా చేయరాదని అభిలషించారు. ఏదైనా ఓ నైపుణ్యాన్ని ఎంచుకుని దానిలో రాటుదేలేలా శ్రమించాలని మోదీ పిలుపునిచ్చారు. నీటి వినియోగంపై దేశంలోని ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన సమయం వచ్చిందని అన్నారు. దేశంలోని టూరిస్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు మరింత స్వచ్ఛత, శుభ్రతలను పాటించాలని కోరారు.