: అసెంబ్లీలో రేవంత్ రెడ్డికి మూడు నిమిషాల సమయమే... ఆ తర్వాత మైక్ కట్ చేసిన స్పీకర్!
కేసీఆర్ చేపట్టిన 'ఆపరేషన్ ఆకర్ష్'లో భాగంగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కుదేలు కాగా, ఆ పార్టీ తరఫున అసెంబ్లీలో గొంతు వినిపించాల్సిన బాధ్యతను రేవంత్ రెడ్డి తన భుజాలపై వేసుకున్నారు. రేవంత్ తో పాటు సండ్ర, ఆర్.కృష్ణయ్యలు మాత్రమే తెలుగుదేశం ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు అసెంబ్లీలో నూతన పారిశ్రామిక విధానంపై చర్చ జరుగుతున్న వేళ, రేవంత్ రెడ్డికి చర్చలో పాల్గొనేందుకు మూడు నిమిషాలు మాత్రమే అవకాశం లభించింది. ఆపై స్పీకర్ మధుసూదనాచారి మైక్ కట్ చేసేశారు. మిగతా వాళ్లకు అవకాశం ఇవ్వాల్సి వుందని, మీరు సబ్జెక్ట్ లో ఉన్నంత వరకూ మాట్లాడనిచ్చామని ఇక కూర్చోవాలని ఆయన అన్నారు. ఈ సమయంలో తనకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని రేవంత్ రెడ్డి పెద్దగా అరవడం వినిపించింది. రేవంత్ కేకలను పట్టించుకోని స్పీకర్ మరో సభ్యుడి పేరు పిలిచారు. తనకిచ్చిన సమయంలోనే తెరాసను ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు రేవంత్ రెడ్డి. ఏ పారిశ్రామికవేత్తకు ఎంత భూమి, ఎంత రేటుకు ఇచ్చారన్న విషయాన్ని సభ ముందుంచాలని డిమాండ్ చేశారు. దళిత పారిశ్రామికవేత్తలకు కేటాయించిన నిధులు పక్కదారి పడుతున్నాయని ఆరోపించారు.