: గోదావరి తీరాన 1982 తరువాత తొలిసారి కనిపించిన దేవాలయాలు!
నాసిక్ కు 25 కిలోమీటర్ల దూరంలోని చందోరీ గ్రామం సమీపంలో గోదావరి నదిలో ఉన్న దేవాలయాలు దాదాపు 3 దశాబ్దాల అనంతరం మరోసారి బయటకు వచ్చాయి. మహారాష్ట్ర రీజియన్ లో కొనసాగుతున్న కరవు పరిస్థితుల కారణంగా గోదావరి పూర్తిగా ఎండిపోయినట్టు కనిపిస్తుండగా, నదిలో మునిగివున్న ఎన్నో దేవాలయాలు బయటకు కనిపిస్తున్నాయి. ఈ ఆలయాలను చివరిగా 1982లో చూసిన ప్రజలు, తిరిగి ఇప్పుడు గుడుల వద్దకు వచ్చి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. వీటిల్లో అత్యధికం శివాలయాలేనని ఇక్కడి వారు చెబుతున్నారు. కాగా, బ్రిటీష్ కాలంలోని 'నాసిక్ గజటీర్'లో గోదావరి నదిలో మునిగిపోతున్న ఈ దేవాలయాలు, ఇక్కడి ఘాట్ల గురించిన వివరాలు ఉన్నాయని, ఆపై ఈ పురాతన ఆలయాల ప్రస్తావన ఎక్కడా లేదని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) అధికారులు తెలిపారు. సాధారణంగా ప్రతి రెండేళ్లకోసారి ఆలయ గోపురాలు మాత్రమే కనిపిస్తూ ఉండేవని, ఈ సంవత్సరం కరవు అధికంగా ఉండటంతో దేవాలయాలన్నీ బయటకు వచ్చాయని, వీటిని తొలిసారిగా చూస్తున్నానని చందోరీ సర్పంచ్ సందీప్ తార్లే వ్యాఖ్యానించారు.