: చప్పట్లు కొట్టడానికేనా మేమున్నది?... మధనపడుతున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు!
ముఖ్యమంత్రి, మంత్రులు మాట్లాడుతున్నప్పుడు బల్లలు చరుస్తూ అభినందనలు తెలపడం తప్ప తమకు మాట్లాడే అవకాశమే రావడం లేదని తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు వాపోతున్నారు. ఆఖరుకు ప్రశ్నోత్తరాల సమయంలో సైతం తాము వేసిన ప్రశ్నలు రావడం లేదని, ప్రతిపక్షంలో కూర్చున్న వారికందరికీ, మాట్లాడే అవకాశం వస్తున్నా, తమకు మాత్రం అవకాశాలు దక్కడం లేదని బాధపడుతున్నార తాము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఎలాంటి ప్రశ్నలనూ సంధించలేకపోతున్నామని స్వయంగా టీఆర్ఎస్ విప్ ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం. కేసీఆర్ అవకాశమిస్తేనే చర్చలో పాల్గొనే అవకాశం వస్తోందని, లేకుంటే ఖాళీగా కూర్చోవాల్సిందేనని ఆయన తన మనసులోని ఆవేదనను బయటపెట్టారు. ఏ కొద్ది మందో మాత్రమే మాట్లాడుతున్నారని, ప్రభుత్వానికి మద్దతుగా బల్లలు చరిచేందుకే తాము పరిమితమయ్యామని ఓ యువ ఎమ్మెల్యే మీడియా ముందు తన గోడు వెళ్లబోసుకున్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకు కేసీఆర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.