: నేను హిందీ సినిమాల్లో ఫుల్ బిజీ...ఈ గొడవలేవీ నాకు తెలియదు!: టాలీవుడ్ నటుడు ఉదయ్
'ఫ్రెండ్స్ బుక్' సినిమాతో టాలీవుడ్ లో రంగప్రవేశం చేసిన వర్ధమాన నటుడు ఉదయ్ పీకల్దాకా తాగిన మైకంలో హోటల్ సిబ్బందిపై దాడులకు దిగిన కేసులో పోలీసులు లోతైన దర్యాప్తు చేశారు. ఇందులో భాగంగా దసపల్లా హోటల్...మూన్ పబ్బులో సీసీ కెమెరా పుటేజ్ ను పోలీసులు బయటపెట్టారు. ఈ పుటేజ్ లో సినీ నటుడు ఉదయ్ చేసిన హంగామా చూసి ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. ఉదయ్ ట్రాక్ రికార్డు తెలిసిన పబ్బు సిబ్బంది అతనిని లోపలికి అనుమతించలేదు. దీంతో రెచ్చిపోయిన ఉదయ్ రాయలేని భాషలో దుర్భాషలాడుతూ, సిబ్బందిపై దాడికి దిగాడు. ఆ పరిసరాల్లో కనిపించిన ప్రతి వస్తువును ధ్వంసం చేశాడు. దీనిపై ఉదయ్ ను వివరణ అడుగగా, తనకు అవేమీ తెలియదని అన్నాడు. తాను ఉదయమే ముంబై నుంచి దిగానని చెప్పాడు. తాను హిందీ సినిమాల్లో ఫుల్లు బిజీగా ఉన్నానని చెప్పాడు. తన పెళ్లి వ్యవహారాలతో తీరిక లేకుండా ఉన్నానని, ఈ గొడవలేవీ తనకు తెలియదని తెలిపాడు. గతంలో నోవాటెల్ హోటల్ లో తన రేంజ్ రోవర్, మెర్సిడెస్ బెంజ్, బొలెరో కార్ల అద్దాలు పగిలిపోయాయని, వాటిని తానే బాగుచేయించుకున్నానని చెప్పాడు. అందుకే, ఎవరి అద్దాలు పగిలిపోతే వారే బాగుచేయించుకోవాలని సూచించాడు. గతంలో ఇతనిపై డ్రగ్స్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. కాగా, ఈ వర్ధమాన నటుడు మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భానుకిరణ్ కి ప్రధాన అనుచరుడని తెలుస్తోంది.