: చేతిలో చిల్లిగవ్వ లేకున్నా దేశం చుట్టేస్తున్న యువకులు!
చేతిలో డబ్బు లేకపోతే ఏమీ చేయలేమని భావించే యువకులు ఎక్కువ మంది ఉన్న ప్రస్తుత సమాజంలో ఉత్తరప్రదేశ్ కు చెందిన అనూజ్ ఖురానా, ఇషాంత్ సింగ్ లు విభిన్నంగా ఆలోచించారు. డబ్బు లేకుండా దేశం మొత్తం చుట్టివద్దామని వీరిద్దరూ భావించారు. అనుకున్నదే తడవుగా తమ యాత్ర వివరాలు సోషల్ మీడియాలో పెట్టి, పెట్టేబేడా సర్దుకుని రోడ్డు మీద పడ్డారు. చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా, వచ్చీపోయే వాహనాలను ఆపుతూ, వారికి తమ యాత్ర గురించి చెబుతూ, వారి సాయంతో... రాత్రనక, పగలనక ప్రయాణిస్తూ చాలా దూరం వెళ్లారు. ఈ సందర్భంగా తమ యాత్ర గురించి వారు మాట్లాడుతూ, ముంబైలో సోషల్ మీడియా మిత్రులతో చేసిన డాన్సులు మర్చిపోలేనివని వారు చెప్పారు. గోవాలో చాలా ఎంజాయ్ చేశామని అన్నారు. కర్ణాటకలో ఓ స్కూల్ యాజమాన్యం తమను ఆహ్వానించి యాత్ర విశేషాలు పిల్లలతో పంచుకునే అవకాశం కల్పించిందని వారు తెలిపారు. తెలియని ప్రాంతాల్లో రోడ్డు మీది పేవ్ మెంట్ల మీద, రోడ్డు కింద వంతెనల్లో, దేవాలయాలు, మసీదులు, చర్చ్ లు, గురుద్వారాల వద్ద విశ్రమించి, ఒక్కోసారి అక్కడ దొరికే ప్రసాదాలతో కడుపునింపుకునేవారు. కొన్ని చోట్ల పాటలు పాడుతూ, డ్యాన్సులు చేస్తూ డబ్బులు పోగేసుకుని హోటళ్లలో తినేవారమని చెప్పారు. ముంబైలో తమ యాత్ర గురించి చెప్పగానే డబ్బులు తీసుకోకుండా ఓ బేకరీ షాప్ యజమాని పిజ్జాలు ఇవ్వడం మర్చిపోలేని అనుభూతి అని వారు పేర్కొన్నారు.