: అనుకున్నట్టే జరిగింది... తెలంగాణలో గ్రూప్-2 పరీక్షలు వాయిదా!
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 పరీక్షలు వాయిదా పడతాయని అనుమానం వ్యక్తం చేసిన అభ్యర్థుల అంచనాలు నిజమయ్యాయి. వాయిదా ప్రసక్తే లేదని, అభ్యర్థులు ప్రిపరేషన్ కొనసాగించాలని అధికారులు సైతం ఆ మధ్య ప్రకటించారు. అయితే, ఏప్రిల్ 23, 24న జరగాల్సిన ఈ పరీక్షలను రెండు నెలలపాటు వాయిదా వేస్తున్నట్లు అధికారులు ఈ రోజు వెల్లడించారు. ఉద్యోగాల సంఖ్య పెంచే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఆర్‌ఆర్‌బీ పరీక్షల దృష్ట్యా ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షలను కూడా ప్రభుత్వం వాయిదా వేసింది. కానిస్టేబుల్ పరీక్ష ఏప్రిల్ 3న జరగాల్సి ఉంది. ఇదిలా ఉండగా, సీఎం కేసీఆర్‌కు టీడీఎల్పీ నేత రేవంత్‌రెడ్డి ఇటీవలే బహిరంగ లేఖ రాసిన విషయం తెలిసిందే. ఆ లేఖలో గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేసి పోస్టుల సంఖ్య పెంచాలని ఆయన లేఖలో డిమాండ్ చేశారు. ఎస్ఐ పరీక్షలో ఇంగ్లిష్ మెరిట్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. గ్రూప్-3 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని, ఎక్సైజ్ ఎస్ఐ అభ్యర్థుల వయోపరిమితి సడలించాలని ఆయన లేఖలో డిమాండ్ చేశారు.