: రేపు మెగాపవర్ స్టార్ బర్త్ డే.. గ్రాండ్‌గా ఏర్పాట్లు!
కెరీర్ ప్రారంభించిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హోదా దక్కించుకోవడం అందరికి సాధ్యం కాదు. అలాంటి అరుదైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. మెగాస్టార్ వారసుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ తేజ్ రేపు బర్త్ డే జరుపుకోబోతున్నాడు. 31వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న 'చెర్రీ' బర్త్‌డే వేడుకలను ఆయన అభిమానులు పెద్ద ఎత్తున నిర్వహించబోతున్నారు. భారీ ఎత్తున రక్తదాన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలతో పాటు తెలుగు వారు ఎక్కడున్నారో అక్కడ భారీ ఎత్తున రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు. మరి కొన్ని ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్టు సమాచారం. మార్చి 28న బెంగళూర్‌లో శ్రీజ పెళ్లి వేడుక జరగనున్న నేపథ్యంలో మెగా ఫ్యామిలీ అంతా రేపు అక్కడికి చేరుకోనున్నట్టు సమాచారం. దీంతో చెర్రీ బంధుమిత్రుల సమక్షంలో జన్మదినాన్ని వేడుకగా చేసుకోనున్నట్టు తెలుస్తోంది. తన డాన్సు, నటనతో ప్రేక్షకుల ఆదరాభిమానాలు చూరగొంటున్న రామ్ చరణ్ ప్రతి ఏటా తన పుట్టిన రోజున సేవా కార్యక్రమాలు చేస్తున్న విషయం తెలిసిందే.