: జేఎన్‌యూ 'యాంటీ నేషనల్' పై వివరణనిచ్చిన గూగుల్
గూగుల్ మ్యాప్‌లో యాంటి నేషనల్, సెడిషన్, లెఫ్టిస్ట్ అని ఏది టైప్ చేసినా ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీను సూచించిన విషయం తెలిసిందే. ఈ విషయమై గూగుల్ స్పందించింది. సెర్చింజన్లో ఉన్న ఒక బగ్ వల్లనే రిజల్ట్ అలా వస్తోందని దాన్ని త్వరలో సవరిస్తామని ఈరోజు పేర్కొంది. ఇటీవల ఢిల్లీ జేఎన్‌యూలో జాతి వ్యతిరేక కార్యక్రమాలు జరుతున్నట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఆరోపణలు ఎదుర్కొన్న జేఎన్‌యూ ఎస్‌యూ అధ్యక్షుడు కన్నయ్య కుమార్ తోపాటు విద్యార్థులు ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్య అరెస్టైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏదైనా అడ్రస్ తెలుసుకునేందుకు చక్కగా ఉపయోగపడే గూగుల్ మ్యాప్‌లో యాంటి నేషనల్ అని టైప్ చేయగానే జేఎన్‌యూను చూపడం వివాదాస్పదమైంది. దీంతో ఈ మేరకు గూగుల్ మీడియా అధికార ప్రతినిధి ఒకరు ఓ మీడియా సంస్థకు మెయిల్ ద్వారా సెర్చింజన్లో ఉన్న బగ్ వల్లనే ఇటువంటి రిజల్ట్ వస్తోందని సమాధానమిచ్చారు. దీనిపై సైబర్ లా నిపుణుడు పవన్ దుగ్గల్ శుక్రవారమే స్పందిస్తూ సాంకేతిక లోపం కారణంగానే ఈ విధంగా జరుగుతోందని తెలిపిన విషయం తెలిసిందే. కంప్యూటర్ నెట్ వర్క్ సమస్య వల్లే ఈ పెద్ద తప్పు జరిగి ఉండవచ్చని ఆయన తెలిపారు.