: ఫ్యామిలీతో పార్టీ చేసుకున్నా... రేవ్ పార్టీ జరగలేదు: ట్విట్టర్ లో నవదీప్
ఫాంహౌస్ లో పార్టీ చేసుకుంటూ పోలీసుల దాడితో పరారైన టాలీవుడ్ కుర్ర హీరో నవదీప్ ట్విట్టర్ లో ప్రత్యక్షమయ్యాడు. రంగారెడ్డి జిల్లా మోమిన్ పేట్ మండలం చక్రంపల్లిలోని తన ఫాంహౌస్ లో నవదీప్ సినీ ప్రముఖులకు రేవ్ పార్టీ ఏర్పాటు చేశాడన్న ఆరోపణలతో నిన్న రాత్రి పోలీసులు ఫాంహౌస్ పై దాడి చేశారు. పోలీసుల రాకను గమనించిన సినీ ప్రముఖులతో పాటు నవదీప్ కూడా అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ తర్వాత అక్కడ సోదాలు చేసిన పోలీసులకు పెద్ద ఎత్తున విదేశీ మద్యం బాటిళ్లు లభ్యమయ్యాయి. కాగా, కొద్దిసేపటి క్రితం నవదీప్ ట్విట్టర్ లో ప్రత్యక్షమయ్యాడు. ఫాంహౌస్ లో తన కుటుంబసభ్యులతో కలిసి పార్టీ చేసుకున్నానని పేర్కొన్న అతడు అక్కడ ఎలాంటి రేవ్ పార్టీ జరగలేదని వివరణ ఇచ్చాడు.