: ప్రేమను తిరస్కరించిందన్న కోపంతో 14ఏళ్ల బాలికను చంపిన ఉన్మాది
ప్రేమకు ఓర్పు, సహనం ఉండాలి. అప్పుడే అది నిజమైన ప్రేమ. కానీ ప్రేమ అనే పేరుతో ఆకర్షణ మోజులో దారుణాలకు ఒడిగడుతున్నారు నేటియువత. పశ్చిమ బెంగాల్‌లో ఇటువంటిదే ఓ సంఘటన చోటుచేసుకుంది. 18ఏళ్లు కూడా నిండని ఓ యువకుడు తన ప్రేమను తిరస్కరించిందన్న అక్కసుతో 14ఏళ్ల బాలికపై దాడికి పాల్పడ్డాడు. జనం మధ్యలోనే నడిరోడ్డుపై బాలికను వెంటాడి నరికి చంపేశాడు. పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఈ దారుణం జరిగింది. వాలీబాల్ ప్లేయర్ అయిన స్థానిక పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోన్న సంగీతా ఎయిచ్.. శుక్రవారం వాలీబాల్ ప్రాక్టీస్ చేస్తుండగా.. రాజా అనే 18ఏళ్ల యువకుడు అక్కడికి వచ్చి తనను ప్రేమిస్తున్నానని చెప్పాడు. ఇందుకు బాలిక నిరాకరించడంతో తన దగ్గర ఉన్న గొడ్డలితో ఆమెపై దాడికి యత్నించాడు. దీంతో ఆ బాలిక పారిపోయేందుకు ప్రయత్నించి రోడ్డుపైకి పరిగెత్తింది. బాలికను వెంబడించిన ఆ ఉన్మాది నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే గొడ్డలితో నరికి పరారయ్యాడు. దీంతో ఆ బాలిక అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.