: అమరావతి మాస్టర్ ప్లానర్ గా ‘మాకీ’నే ఎందుకు?... కారణాలివిగో!
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధానిలో ప్రభుత్వ భవనాల(సీడ్ కేపిటల్) మాస్టర్ ప్లానర్ గా జపాన్ కు చెందిన ప్రముఖ నిర్మాణ రంగ సంస్థ ‘ఫుమిహికో మాకీ అండ్ అసోసియేట్స్’ ఎంపికైంది. అమరావతి సీడ్ కేపిటల్ మాస్టర్ ప్లాన్ ను ‘మాకీ’తో పాటు భారత్ కు చెందిన వాస్తుశిల్ప కన్సల్టెంట్, బ్రిటన్ కు చెందిన రోజర్స్ సిట్రక్ హార్బర్ అండ్ పార్టనర్స్ కూడా ఏపీ సర్కారు నియమించిన జ్యూరీ కమిటీకి అందించాయి. ఒకదానితో మరొకటి పోటీ పడేలా ఉన్న సదరు ప్లాన్లను జ్యూరీ కమిటీ ఆసాంతం పరిశీలించింది. దాదాపు మూడు రోజుల పాటు మూడు ప్లాన్లను క్షుణ్ణంగా పరిశీలించిన జ్యూరీ కమిటీ... జపాన్ కు చెందిన ‘మాకీ’నే మాస్టర్ ప్లానర్ గా ఎంపిక చేసింది. ఇందుకు కేవలం నాలుగు, ఐదు అంశాలే దోహదం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ కారణాలను కూడా జ్యూరీ కమిటీ ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడి ముందు పెట్టింది. జ్యూరీ కమిటీ చేసిన వాదనకు ఓకే చెప్పిన చంద్రబాబు ‘మాకీ’ ప్లాన్ కే ఓటేశారు. మాస్టర్ ప్లానర్ గా ‘మాకీ’ ఎంపికకు దోహదం చేసిన కారణాలను విశ్లేషిస్తే... అమరావతి సీడ్ కేపిటల్ కు సంబంధించి చంద్రబాబు ప్రభుత్వం భావిస్తున్న నమూనాకు ‘మాకీ’ ప్లాన్ అతి దగ్గరగా ఉంది. ఇక ‘బ్లూ-గ్రీన్ కాన్సెప్ట్’కు జపాన్ సంస్థ అత్యధిక ప్రాధాన్యమిచ్చింది. మొత్తం విస్తీర్ణంలో ఏకంగా 70 శాతాన్ని జలవనరులు, పచ్చదనానికి కేటాయించడం కూడా ఆ సంస్థకు కలిసివచ్చింది. భూఉపరితలంపైనే కాక ఆయా భవనాల టెర్రస్ లపైనా పచ్చదనాన్ని పెంచేలా ఆ సంస్థ ప్లాన్ చేసింది. దీంతో తాము ఊహించిన దానికంటే సీడ్ కేపిటల్ మరింత పర్యావరణ హితం కానుందన్న భావన జ్యూరీ కమిటీలో వ్యక్తమైంది. ఇక ప్రతి భవనంపైనా సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుతో... సంప్రదాయేతర, కాలుష్య రహిత ఇంధన వినియోగానికి ‘మాకీ’ తెర తీసింది. ఈ నిర్ణయం కూడా మిగిలిన రెండు కంపెనీల కంటే ‘మాకీ’ ముందుకు దూసుకెళ్లడానికి ప్రధాన కారణంగా నిలిచింది. ఇక ‘మాకీ’ ప్రతిపాదించిన తరహా నిర్మాణాలు మిగిలిన వాటితో పోలిస్తే సులభతరంగా ఉన్నాయి. రాజధాని నిర్మాణానికి ఏపీ సర్కారుకు అందుబాటులో ఉన్న నిధులు, నిర్దేశించుకున్న గడువులపై కూడా ‘మాకీ’ కీలక దృష్టి సారించింది. 2018లోగా సీడ్ కేపిటల్ ను పూర్తి చేయాలని చంద్రబాబు భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఆయన స్పష్టమైన ప్రకటన కూడా చేశారు. ఇక కేంద్రం పెద్దగా సహకరించని నేపథ్యంలో తక్కువ ఖర్చుతో కూడిన నిర్మాణాలైతే బాగుంటుందన్న భావన కూడా ఏపీ సర్కారులో వ్యక్తమవుతోంది. దీనిని కూడా పరిగణనలోకి తీసుకున్న ‘మాకీ’... తక్కువ సమయంలో, తక్కువ ఖర్చులో పటిష్ట నిర్మాణాలను రూపొందించే ప్లాన్ ను రూపొందించింది. ఈ కారణాల వల్లే ఆ సంస్థ ప్లాన్ నే జ్యూరీ కమిటీ మాస్టర్ ప్లాన్ గా ఎంపిక చేసింది.