: 15 అంతస్తుల్లో నవ్యాంధ్ర సచివాలయం!... టాప్ ఫ్లోర్ లో సీఎం ఆఫీస్!
నవ్యాంధ్రప్రదేశ్ నూతన సచివాలయం 60 అంతస్తుల్లో ఏర్పాటు కానుందని, చివరి అంతస్తులో అంతెత్తున సీఎం కార్యాలయం ఉంటుందని గతంలో వెలువడ్డ వార్తలు ఆసక్తి రేపాయి. అయితే అంతెత్తున ఉండే సచివాలయం అమరావతిలో ఏర్పాటు కావడం లేదని తేలిపోయింది. ఆర్భాటాలకు పోకుండా పర్యావరణ హితంగా రూపొందనున్న అమరావతిలో పరిపాలన కీలక కేంద్రం సచివాలయం (సెక్రటేరియట్) కేవలం 15 అంతస్తుల్లో మాత్రమే ఏర్పాటు కానుంది. ఈ మేరకు జపాన్ సంస్థ ‘మాకీ’ రూపొందించిన మాస్టర్ ప్లాన్ స్పష్టం చేస్తోంది. మొత్తం అమరావతిలోని ప్రభుత్వ భవనాలన్నింటిలోకి 15 అంతస్తులతో ఏర్పాటు కానున్న సెక్రటేరియట్టే అత్యంత ఎత్తైన భవనంగా విరాజిల్లనుంది. ఈ భారీ భవంతిలో పైన 14వ అంతస్తులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయం ఏర్పాటు కానుండగా, టాప్ ఫ్లోర్ లో మాత్రం సీఎం కార్యాలయం కొలువుదీరనుంది. ఇక అమరావతిలో ఏర్పాటు కానున్న ప్రభుత్వ భవనాలన్నీ 7 అంతస్తుల లోపే నిర్మితం కానున్నాయి.