: మరో సెమీస్ బెర్త్ ఖరారు... సఫారీలపై విజయంతో సెమీ ఫైనల్ చేరిన వెస్టిండీస్
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ మెగా టోర్నీలో భాగంగా ఇప్పటికే న్యూజిల్యాండ్ సెమీస్ బెర్తు ఖరారు చేసుకోగా... నిన్నటి మ్యాచ్ లో సఫారీలను చిత్తు చేసిన కరీబియన్లు నేరుగా సెమీస్ చేరుకున్నారు. ఇక మిగిలిన రెండు బెర్తుల కోసం జట్లన్నీ పోరు సాగించనున్నాయి. నాగ్ పూర్ వేదికగా నిన్న జరిగిన లీగ్ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 122 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ తర్వాత 123 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ కూడా... విధ్వంసకర బ్యాట్స్ మన్ క్రిస్ గేల్ (4) విఫలమవడంతో కష్టాల్లో పడింది. అయితే జాన్సన్ చార్లెస్ (32), మార్లన్ శామ్యూల్స్ (44) రాణించడంతో వెస్టిండీస్ జట్టు సునాయసంగానే జయకేతనం ఎగురవేసింది. చివరలో వరుసగా నాలుగు వికెట్లు వెంటవెంటనే కూలడంతో ఉత్కంఠ నెలకొంది. ఈ దశలో మ్యాచ్ సఫారీల చేతుల్లోకి వెళ్లినట్లు కనిపించినా, టెయిలెండర్లు సమయస్ఫూర్తితో రాణించడంతో కరీబియన్లు గట్టెక్కారు. ఈ విజయంతో వెస్టిండీస్ గ్రూప్-ఏ నుంచి నేరుగా సెమీస్ కు వెళ్లగా, సఫారీలు మాత్రం తమ సెమీస్ అవకాశాలను జటిలం చేసుకున్నారు.