: జగన్ కు మరో షాక్!... త్వరలోనే ‘సైకిల్’ ఎక్కనున్న జ్యోతుల?


వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఈ సారి భారీ షాకే తగలనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాపు సామాజిక వర్గంలో మంచి పేరున్న ఆ పార్టీ సీనియర్ నేత, ఏపీ అసెంబ్లీలో శాసనసభాపక్ష ఉపనేత, పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ టీడీపీలో చేరేందుకు దాదాపు రంగం సిద్ధం చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. పార్టీ మారేందుకు ఇప్పటికే దాదాపుగా నిర్ణయం తీసుకున్న జ్యోతుల... అసెంబ్లీ సమావేశాలు పూర్తి కాగానే ‘సైకిల్’ ఎక్కడం ఖాయమేనన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. అప్పటిదాకా ‘గంటలో టీడీపీ ప్రభుత్వాన్ని పడగొడతా’నంటూ బీరాలు పలికిన జగన్... ఈ దెబ్బతో ఆత్మరక్షణలో పడిపోయారు. ఈ తరహా అనుభవాలను అంతగా పట్టించుకోని ఆయన మొన్న ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్ గా తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని ఎంపిక చేశారు. పార్టీలో సీనియర్ నేతగా ఉన్న జ్యోతుల ఈ పదవిని ఆశించారు. పార్టీ సీనియర్లు కూడా జ్యోతులకు మద్దతు పలికారు. అయితే ఆ పదవికి బుగ్గనను ఎంపిక చేస్తూ జగన్ తీసుకున్న నిర్ణయంతో షాక్ తిన్న జ్యోతుల ఆ తర్వాత పార్టీ మారే దిశగా అడుగులు వేసినట్లు సమాచారం. విషయాన్ని పసిగట్టిన టీడీపీ నేతలు జ్యోతులను సంప్రదించారు. విడతలవారీగా జరిగిన చర్చలతో జ్యోతుల టీడీపీ వైపు వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు ముగియగానే జ్యోతుల టీడీపీలో చేరడం ఖాయమేనన్న వార్తలు వైసీపీలో పెను కలకలాన్నే రేపనున్నాయి.

  • Loading...

More Telugu News