: బేరసారాల ఆరోపణలపై వైగోకు నోటీసులు పంపిన కరుణానిధి
తమిళనాట ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఆరోపణలు ప్రత్యారోపణలతో రాజకీయ రణరంగం ఆసక్తిరేపుతోంది. తాజాగా డీఏంకేపై ఎండీఎంకే పార్టీ అధినేత వైగో చేసిన ఆరోపణలపై డీఎంకే అధినేత కరుణానిధి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా క్షమాపణలు చెప్పాలంటూ నోటీసులు పంపారు. డీఎండీకే అధినేత విజయ్ కాంత్ కు డీఎంకే, బీజేపీలు బంపర్ ఆఫర్ ఇచ్చాయని వైగో తెలిపారు. డీఎంకేతో విజయ్ కాంత్ పొత్తుకు సై అంటే 500 కోట్ల రూపాయలు, 80 అసెంబ్లీ సీట్లను ఇస్తామని ఆఫర్ ఇచ్చిందని, బీజేపీ అయితే ఈ ఎన్నికల్లో ఎన్ని సీట్లు కావాలంటే అన్ని సీట్లు తీసుకోవాలని, మొత్తం ఎన్నికల ఖర్చును తాము చూసుకుంటామని, గెలుపోటములతో సంబంధం లేకుండా కేంద్ర మంత్రి పదవి కూడా ఇస్తామని బేరాలాడిందని వైగో ఆరోపించారు. దీనిపై కరుణానిధి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అసత్య ఆరోపణలను వాపస్ తీసుకుని, క్షమాపణలు చెప్పాలని ఆయన లీగల్ నోటీస్ పంపారు.