: తాతలిద్దరం మరోసారి కలవడం ఆనందంగా ఉంది: బాలకృష్ణ
నా మనవడి మొదటి పుట్టిన రోజుకు తాతలిద్దరం కలిశాం...అలాగే ఈ సినిమా ఆడియో వేడుకలో తాతలిద్దరం కలవడం ఆనందంగా ఉంది. అంతకంటే ఈ ఆడియో వేడుక కుటుంబ వేడుకలా ఉంది' అని ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు. విజయవాడలో నిర్వహించిన 'రాజా చెయ్యివేస్తే' సినిమా ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, "పుట్టిన వాడు గిట్టక తప్పదు...అందుకే కొందరు కర్మఫలం అనుసరించి శరీరాల్ని ఆశ్రయిస్తారు...అలా మానవ శరీరం ఆశ్రయించిన మహానుభావుడే నందమూరి తారకరామారావుగారు" అన్నారు. తను పుట్టిన రాష్ట్రానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చిన మహానటుడు ఎన్టీఆర్ అని ఆయన చెప్పారు. ఈ ఆడియో వేడుకకు విచ్చేసిన కళాపోషకులు, కళా పిపాసకులందరికీ ధన్యవాదాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా పోతన చెప్పిన పద్యాన్ని చెప్పి అభిమానులను అలరించారు. ఎందరో మహానుభావులు జన్మించిన విజయవాడ నేలపై ఆడియో వేడుక నిర్వహించడం ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. ఆణిముత్యాల్లాంటి పాటలు ఈ సినిమాలో ఉన్నాయని ఆయన చెప్పారు. అద్భుతమైన బాణీలతో ఆయన ఆకట్టుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా బాలయ్య హిందీలో హీరోయిన్ ను పొగిడి అందర్నీ అలరించారు.