: సినిమా, టీవీ జూనియర్ ఆర్టిస్ట్స్ ఏజెంట్స్ యూనియన్ కార్యదర్శిపై చీటింగ్ కేసు నమోదు
తెలంగాణ సినిమా, టీవీ జూనియర్ ఆర్టిస్ట్స్ ఏజెంట్స్ యూనియన్ కార్యదర్శి ఠాగూర్ పై చీటింగ్ కేసు నమోదైంది. ఈ యూనియన్ కు చెందిన ఒక సభ్యుడి ఫిర్యాదు మేరకు హైదరాబాదు, జూబ్లిహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గత ఏడాది తెలంగాణ సినిమా, టీవీ జూనియర్ ఆర్టిస్ట్స్ ఏజెంట్స్ యూనియన్ ను స్థాపించారు. బంజారాహిల్స్ రోడ్ నంబరు 2 లోని అన్నపూర్ణ స్డూడియో ఎదురుగా ఉన్న జవహర్ కాలనీలో ఈ యూనియన్ ఉంది. ఈ యూనియన్ లో సభ్యుడిగా చేరేందుకుగాను పలువురు ఆర్టిస్టులు లక్షన్నర రూపాయలు చెల్లించి సభ్యత్వం తీసుకున్నారు. వి.శ్రీనివాస్ అనే యువకుడు కూడా డబ్బు చెల్లించి యూనియన్ సభ్యత్వం తీసుకున్నాడు. సినిమాల్లో వేషాల కోసం ప్రయత్నించగా, ఈ గుర్తింపు కార్డు చెల్లదంటూ షూటింగ్ ల దగ్గర నుంచి అతన్ని వెనక్కి పంపివేశారు. ఈ విషయాన్ని కార్యదర్శి ఠాగూర్ దృష్టికి తీసుకువచ్చినప్పటికీ ఆయన స్పందించలేదు. ఇదే యూనియన్ లో సభ్యులుగా ఉన్న మరో 83 మంది యువకులకు కూడా చేదు అనుభవం ఎదురైన విషయం తెలుసుకున్న శ్రీనివాస్ తమకు ఫిర్యాదు చేశాడని పోలీసులు తెలిపారు.