: 100 పరుగులు పూర్తి చేసిన పాకిస్థాన్
మొహాలీ వేదికగా జరుగుతున్న టీ20 మ్యాచ్ లో పాకిస్థాన్ జట్టు ధాటిగా ఆడుతోంది. 194 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్థాన్ జట్టుకు ఓపెనర్ షెర్జిల్ ఖాన్ (30) శుభారంభం ఇస్తే, మరో ఓపెనర్ షెహజాద్ (1) దారుణంగా నిరాశపరిచాడు. దీంతో క్రీజులోకి వచ్చిన ఖలీద్ లతీఫ్ (31) సంయమనంతో ఆడుతూ ఆకట్టుకున్నాడు. ఇంతలో షెర్జిల్ ను జేమ్స్ ఫల్కనర్ పెవిలియన్ బాటపట్టించాడు. దీంతో క్రీజులోకి వచ్చిన ఉమర్ అక్మల్ (32) చూడచక్కని షాట్లతో అలరించాడు. అనంతరం వచ్చిన షాహిద్ అఫ్రిది (14) వస్తూనే విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో రెండు భారీ సిక్సర్లు బాదాడు. దీంతో పాక్ 13.5 ఓవర్ లో సెంచరీ మార్కును చేరుకుంది. షాహిద్ ఇక నిలదొక్కుకున్నాడనుకునేంతలో జంపాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో పాకిస్థాన్ జట్టు 13.2 ఓవర్లలో 110 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయింది. క్రీజులో ఖలీద్ లతీఫ్ కు జతగా షోయబ్ మాలిక్ ఆడుతున్నాడు. ఆసీస్ బౌలర్లలో జంపా రెండు వికెట్లు తీసుకోగా, జేమ్స్ ఫల్కనర్, హాజిల్ వుడ్ చెరో వికెట్ తీసుకున్నారు.