: రేపు విశాఖలో అంతర్జాతీయ విమానయాన శాఖ సదస్సు... సమస్యలపై చర్చ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్టణం మరో భారీ సదస్సుకు వేదిక కానుంది. ఆంధ్రప్రదేశ్ ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్, ఏపీ పరిశ్రమల సమాఖ్య, ఏపీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ లు రేపు అంతర్జాతీయ విమానయాన సదస్సును నిర్వహించనున్నాయి. ఈ సదస్సు ద్వారా విమానయాన సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి అధికారులు తీసుకురానున్నారు. ఈ సదస్సులో స్వదేశీ, విదేశీ విమానయాన సంస్థలు పాల్గొననున్నాయి. ఈ సమావేశానికి పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజుతో పాటు ఆ శాఖ ముఖ్య అధికారులు హాజరుకానున్నారు. సిల్క్ వే, టైగర్ ఎయిర్ వేస్, ఫ్లై దుబాయ్, ఇతిహాద్ వంటి విమానయాన సంస్థలు, స్వదేశానికి చెందిన మరో 20 సంస్థలు పాల్గొననున్నాయి. ఈ సదస్సు ద్వారా రాష్ట్రంలోని విమానయాన సంస్థలు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతారు. నవ్యాంధ్రలో ఏకైక అంతర్జాతీయ విమానాశ్రయంగా ఉన్న విశాఖపట్టణానికి మరిన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులు నడపాలన్న డిమాండ్ ను ప్రభుత్వం దృష్టికి తీసుకురానున్నారు. విశాఖపట్టణం నుంచి ఇప్పటికే దుబాయ్, సింగపూర్ లకు అంతర్జాతీయ విమాన సర్వీసులు ఉన్నాయి. అయితే, దుబాయ్ వెళ్లే ఎయిర్ ఇండియా విమానం హైదరాబాద్ మీదుగా నడుస్తోంది. అయితే, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వేలాది మంది అరబ్ దేశాలలో పనిచేస్తున్నారు. హైదరాబాదు మీదుగా విమానం వెళ్లడంతో తమ సమయం, డబ్బు వృథా అవుతున్నాయని, దుబాయ్ కి నేరుగా విమానం నడపాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే, ఈ విషయమై దుబాయ్ విమానయాన సంస్థలు ఆసక్తి చూపుతున్నా, కేంద్ర ప్రభుత్వం అనుమతినివ్వటం లేదు. ఇక కొలంబో, థాయ్ లాండ్ వెళ్లే పర్యాటకుల విషయానికొస్తే వారు చెన్నై, కోల్ కతా వెళుతున్నారు. ఈ రెండు దేశాలు నేరుగా విశాఖపట్టణానికే విమానాలు నడిపేందుకు ఆసక్తిగా ఉన్నాయి. ఈ విషయాలన్నింటిని నేరుగా సంబంధిత శాఖకు ఈ సదస్సు ద్వారా తెలియజేయనున్నాయి. విశాఖపట్టణం నుంచి సరుకు రవాణాకున్న అవకాశాలను అధికారులు వివరించనున్నారు.