: ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిన ఈమే 'బ్రస్సెల్స్' బాంబు దాడి బాధిత జెట్ ఉద్యోగిని!


బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ పై ఉగ్రదాడి జరిగిన వేళ, బయటకు వచ్చిన తొలి చిత్రాల్లో ఒక ఫోటో అందరికీ గుర్తుండే ఉంటుంది. విమానాశ్రయంలోని ప్రయాణికుల వెయిటింగ్ చైర్లో చినిగిన దుస్తుల్లో ముఖాన రక్తపు గాయాలతో, కళ్లలో దైన్యతతో కూడిన ఓ యువతి చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లోని పత్రికల్లో ప్రచురితమైంది. ఆ మహిళ ఎవరన్న విషయం ఆనాడు వెల్లడి కాలేదు. ఈమే ముంబై నివాసి, జెట్ ఎయిర్ వేస్ లో ఇన్ ఫ్లైట్ మేనేజర్ గా పనిచేస్తున్న నిధి చాపేకర్. 1996లో జెట్ ఎయిర్ వేస్ లో చేరిన ఈమె, కొంతకాలంగా ముంబై - బ్రస్సెల్స్ విమానానికి సేవ చేస్తోంది. ఉగ్రదాడి జరిగిన ముందురోజే ఆమె అక్కడికి వెళ్లి పేలుళ్ల బాధితురాలైంది. ఆ సమయంలో అక్కడే ఉన్న బెల్జియం ప్రముఖ ఫోటో జర్నలిస్ట్ కెటావా కర్దానా ఈ చిత్రాన్ని తీశారు. "ఆ సమయంలో నేను అక్కడే ఉండటం యాదృచ్ఛికమే. ఓ పని కోసం జెనీవా వెళ్లేందుకు విమానాశ్రయానికి రాగా, పేలుళ్లు జరిగాయి. చుట్టూ పొగ తప్ప మరేమీ కనిపించలేదు. తీవ్రగాయాలైన వారికి సహాయపడే నిమిత్తం డాక్టర్... డాక్టర్ అని కేకలు పెడుతూనే జరిగిన ఘటనను ప్రపంచానికి చూపాల్సిన నా విధిని నేను నిర్వర్తించాను. నా ఎదురుగా ఉన్న నిధిని ఫోటో తీసి ఫేస్ బుక్ కు వెంటనే యాడ్ చేశాను" అని చెప్పారు. ఇప్పుడీ ఫోటో వియత్నాం యుద్ధ సమయంలో నగ్నంగా పరికెత్తుకొస్తున్న చిన్న పాప, ఇటీవల వలస వస్తూ మరణించిన అయిలాన్ కుర్దీల చిత్రాల తరహాలోనే చరిత్రలో నిలిచిపోనుంది.

  • Loading...

More Telugu News