: భారత్, బంగ్లా హైటెన్షన్ మ్యాచ్ వీక్షిస్తూ... గుండెపోటుతో మరణించిన అభిమాని!
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ మెగా టోర్నీలో మొన్న భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య హైటెన్షన్ మ్యాచ్ జరిగింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో దాదాపుగా చేజారిన మ్యాచ్ ను తిరిగి తన చేతుల్లోకి తీసుకున్న టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ కు కనువిందు చేసింది. అయితే ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ క్రికెట్ అభిమాని ప్రాణాన్ని ఈ మ్యాచ్ మింగేసింది. మ్యాచ్ లో సత్తా చాటిన బంగ్లాదేశ్ కుర్రాళ్లు దాదాపుగా విజయం చెంతకు చేరారు. అయితే కెప్టెన్ కూల్ మహేంద్రసింగ్ ధోనీ వేసిన పక్కా ప్లాన్ ను యువ బౌలర్ హార్దిక్ పాండ్యా ఏమాత్రం పొల్లు పోకుండా అమలు చేశాడు. వెరసి బంగ్లా చేతిలోకి వెళ్లిపోయిందనుకున్న మ్యాచ్ చివరి ఓవర్ చివరి బంతికి భారత్ దరి చేరింది. భారత ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు. ఆఖరి ఓవర్ ఆరు బంతులు ఫ్యాన్స్ లో హైటెన్షన్ ను రేకెత్తించాయి. ఈ మ్యాచ్ చూస్తున్న యూపీ వ్యక్తి ఓం ప్రకాశ్ శర్మ గుండెపోటుకు గురయ్యాడు. వెనువెంటనే ఆసుపత్రికి తరలించినా, మార్గమధ్యలోనే అతడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో యావత్తు క్రికెట్ అభిమానులకు కనువిందు చేసిన ఈ థ్రిల్లింగ్ మ్యాచ్... ఓం ప్రకాశ్ శర్మ ఇంటిలో మాత్రం విషాదాన్ని నింపింది.